Begin typing your search above and press return to search.

అవంతికి సెగ పెడుతున్న విశాఖ కార్పొరేష‌న్‌.. గెలిచినా... ఓడినా తంటానే!

By:  Tupaki Desk   |   9 March 2021 9:52 AM GMT
అవంతికి సెగ పెడుతున్న విశాఖ కార్పొరేష‌న్‌.. గెలిచినా... ఓడినా తంటానే!
X
విశాఖప‌ట్నం కార్పొరేష‌న్ ఎన్నిక‌లు అధికార‌ వైసీపీకి అత్యంత కీల‌కంగా మారాయి. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్క‌డం ద్వారా విశాఖ ప్ర‌జ‌లు త‌మ నిర్ణ‌యాల‌కు అనుకూలంగా ఓటేశార‌ని.. ప్ర‌తిప‌క్షాల‌ను తిప్పికొట్టార‌ని చెప్పుకొనేందుకు వైసీపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ కీల‌క నేత‌, ఉత్త‌రాంధ్ర జిల్లాల ఇంచార్జ్‌.. విజ‌య‌సాయిరెడ్డి.. విశాఖ గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఆఖ‌రుకు ఎంపీ స‌త్య‌నారాయ‌ణను కూడా ప‌క్క‌న పెట్టి అన్నీతానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇది మంచిదే. పార్టీని గెలిపించ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌డం లేదు.. కానీ.. ఇదే పార్టీలో మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ వ‌ర్గంలో మాత్రం సాయిరెడ్డి దూకుడుపై గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. విశాఖ‌ప‌ట్నం నుంచి ఎంతో మంది నాయ‌కులు గెలిచినా.. సీఎం జ‌గ‌న్ మాత్రం టీడీపీ నుంచి ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి.. భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన అవంతి శ్రీనివాస్‌కు మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. దీంతో ఆయ‌న జిల్లా వ్యాప్తంగా హ‌వా ప్ర‌ద‌ర్శించాల‌ని అనుకున్నారు. ప్ర‌ధానంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌పై ఆధిప‌త్యం చ‌లాయించాల‌ని భావించారు..

కానీ, అవంతి దూకుడుకు ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న సాయిరెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెడుతున్నారు. జిల్లా రాజ‌కీయాల‌ను అన్నీ త‌న క‌నుసైగ‌ల‌తో న‌డిపిస్తున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ త‌న వేలు పెడుతున్నారు. ఇప్ప‌టికే ఇది ఇద్ద‌రి మ‌ధ్య అంత‌ర్గ‌త పోరుగా మారింది. దీంతో కొన్నాళ్ల‌పాటు.. అవంతి మౌనం పాటించారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్ప‌ని ప‌రిస్థితి అయి.. సాయిరెడ్డితో వేదిక‌లు పంచుకుంటున్నారు.. రేపు క‌నుక విశాఖ‌లో వైసీపీ విజ‌యం సాధిస్తే.. ఖ‌చ్చితంగా ఈ క్రెడిట్ సాయిరెడ్డి ఖాతాలోకే వెళ్తుంది.

ఈ విష‌యంలో అవంతి వ‌ర్గం సానుకూలంగానే ఉన్నా. ఈ `గెలుపు` సాయిరెడ్డి దూకుడును మ‌రింత పెంచుతుంద‌నేది వారి భావ‌న‌గా ఉంది. అంటే.. ఇప్ప‌టికే త‌మకు సెగ పెడుతున్న సాయిరెడ్డి రాజ‌కీయం మ‌రింత పెరుగుతుందని.. విశాఖ న‌గరంలో అవంతి వ‌ర్గం మ‌రింత మైన‌స్ అయిపోతుంద‌ని వీరు భావిస్తున్నారు. అలాగ‌ని వైసీపీ గెలుపు అనేది అవంతికి కూడా అత్యంత అవ‌స‌రం. రేపు ఇక్క‌డ వైసీపీ ఓడిపోతే.. సాయిరెడ్డి త‌ప్పుకొని.. త‌న‌పై నింద మోపే అవ‌కాశం కూడా ఉంద‌ని అవంతి వ‌ర్గం భావిస్తోంది. గెలిస్తే.. త‌మ‌పై సాయిరెడ్డి పెత్త‌నం.. మ‌రింత పెరుగుతుంద‌ని.. ఓడితే.. అధిష్టానం ద‌గ్గ‌ర‌.. త‌మ ప‌రువు మొత్తం పోవ‌డంతోపాటు.. మంత్రి సీటుకే ఎస‌రు రావ‌డం ఖాయ‌మ‌ని అవంతి వ‌ర్గం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.