Begin typing your search above and press return to search.

విశాఖలో నకిలీ పోలీస్‌ ఘరానామోసం..ఏంచేసాడంటే ?

By:  Tupaki Desk   |   22 Jun 2020 6:00 AM GMT
విశాఖలో నకిలీ పోలీస్‌ ఘరానామోసం..ఏంచేసాడంటే ?
X
ఈ మధ్య కాలంలో ఏ ఉద్యోగం లేకపోయినా , ప్రభుత్వ ఉద్యోగం చేస్తునట్టు ఐడెంటిటీ క్రియేట్ చేసి , ఫొటోస్ దిగి మోసం చేసి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విశాఖపట్నంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన పైడి రామచంద్రరావు పోలీసుశాఖలో ఎస్‌ ఐగా పనిచేస్తున్నట్లు ఫేక్ ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. ఖాకీ దుస్తుల్లో ఫొటోలు దిగి వాటితో విశాఖలోని గవర కంచరపాలెం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమలోకి దించాడు. 2019, జూన్‌ 19వ తేదీన వన్‌టౌన్‌ ప్రాంతంలోని ఓ ఆలయంలో కులాంతర వివాహం చేసుకొన్నాడు.

ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుండటంతో అనుమానం వచ్చిన భార్య నిలదీయగా, తాను సస్పెన్షన్‌కు గురయ్యానని, ఆరోగ్యం బాగోలేక లాంగ్ లీవ్ పెట్టానని నమ్మిస్తూ వచ్చాడు. గ్రూప్‌-1 పరీక్షలకు సిద్ధమవుతున్నానంటూ నమ్మించి బాధితురాలి తండ్రి నుంచి రూ.12.80 లక్షలు తీసుకున్నాడు. భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి ఆమె పేరిట రూ.లక్ష రుణం, భార్య సోదరి వద్ద కూడా కొంత బంగారం తీసుకుని తాకట్టు పెట్టాడు. తాను పెళ్లి చేసుకున్న విషయం తల్లిదండ్రులకు, అక్కకు తెలియకుండా రామచంద్రరావు జాగ్రత్త పడ్డాడు.

ఫిబ్రవరిలో ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు యువతిని అసభ్య పదజాలంతో దూషించారు. తన కొడుకు వలలో వేసుకున్నావంటూ నీచంగా మాట్లాడారు. దీనిపై ఆమె భర్తను నిలదీయగా నిమ్మకి నీరెత్తినట్టు నిలబడ్డాడు. దీనితో ఆమె స్నేహితుల సాయంతో ఆరా తీయగా అతడు అసలు పోలీసే కాదని తేలింది.దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు తనను భర్త కుటుంబసభ్యులు కులం పేరుతో దూషించారంటూ గత నెల 29వ తేదీన కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామచంద్రరావు పోలీసు శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నానంటూ నమ్మించి పెళ్లి చేసుకోవడమే కాకుండా, తన తండ్రి వద్ద భారీగా నగదు తీసుకున్నాడని, తనతో పాటు తన సోదరి బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే నకిలీ పోలీసు అవతారమెత్తి తనను మోసగించిన రామచంద్రరావుపై పోలీసులు సాధారణ సెక్షన్ల కిందే కేసు నమోదు చేశారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.