Begin typing your search above and press return to search.

వివేకా హ‌త్య కేసులో ఏదో జ‌ర‌గ‌బోతుంది!

By:  Tupaki Desk   |   4 March 2022 8:30 AM GMT
వివేకా హ‌త్య కేసులో ఏదో జ‌ర‌గ‌బోతుంది!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఒక్కొక్క‌టికి బ‌య‌ట‌కు వ‌స్తున్న వాంగ్మూలాల‌తో వాతావ‌ర‌ణం వేడిగా మారింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ కేసులో సీబీఐ అధికారులు త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మ‌రికొంత మందిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నార‌నే ప్ర‌చారం జోరందకుంది. వివేకా హ‌త్య కేసులో కీల‌క‌మైన షేక్ ద‌స్త‌గిరి, వాచ్‌మ‌న్ రంగ‌న్న‌కు భ‌ద్ర‌త పెంపుపై సీబీఐ దృష్టి సారించ‌డ‌మే అందుకు కార‌ణంగా క‌నిపిస్తోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

వాళ్ల‌కు భ‌ద్ర‌త‌..

వివేకా హ‌త్య కేసులో ఏ క్ష‌ణాన ఏం జ‌రగ‌బోతుందో తెలీని ప‌రిస్థితి ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ఏ4 నిందితుడు షేక్ ద‌స్త‌గిరి, కీల‌క సాక్షి వాచ్‌మ‌న్ రంగ‌న్న‌కు భ‌ద్ర‌త పెంచాల‌ని సీబీఐ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఆ ఇద్ద‌రితో సీబీఐ అధికారులు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. దీంతో ఈ కేసులో త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై సీబీఐ దృష్టి సారించింద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కీల‌క వ్యక్తుల అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్న నేప‌థ్యంలోనే ద‌స్త‌గిరి, రంగ‌న్న‌ల‌కు భ‌ద్రత పెంచిన‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఏదైనా కేసులో కీల‌క ప‌రిణామాల‌కు ముందు దానికి సంబంధించిన వ్య‌క్తుల‌కు భ‌ద్ర‌త పెంచ‌డంపై విచార‌ణ వ్య‌వ‌స్థ‌లు ఫోక‌స్ పెడ‌తాయి. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరి విష‌యంలోనూ సీబీఐ అదే చేస్తుంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.

నోటీసుల తిరస్క‌ర‌ణ‌..

వివేకా హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డితో పాటు ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డిల‌ను విచారించేందుకు సీబీఐ సిద్ధ‌మైంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోని సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌య ముఖ్య అధికారులు పులివెందుల‌కు వెళ్లార‌ని తెలిసింది. విచార‌ణ కోసం అవినాశ్‌తో పాటు భాస్క‌ర్‌రెడ్డిల‌కు నోటీసుల‌కు ఇచ్చేందుకు సీబీఐ ప్ర‌య‌త్నించ‌గా.. వాళ్లు తిర‌స్క‌రించార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో క‌డ‌ప జిల్లా కోర్టును ఆశ్ర‌యించేందుకు సీబీఐ అధికారులు సిద్ధ‌మ‌య్యార‌ని తెలిసింది. మ‌రోవైపు ఈ కేసులో అయిదో నిందితుడు దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్పై విచార‌ణ సంద‌ర్భంగా త్వ‌ర‌లో కీల‌క వ్య‌క్తుల‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్లు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింద‌ని స‌మాచారం. మ‌రి తాజా ప‌రిణామాలు చూస్తుంటే వివేకా హ‌త్య కేసు ఏదో సంచ‌ల‌న మ‌లుపు తిర‌గ‌నుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.