Begin typing your search above and press return to search.

వివేకా మ‌ర్డ‌ర్ కేసు: దేవిరెడ్డి పై సీబీఐ చార్జ్ షీటు

By:  Tupaki Desk   |   4 Feb 2022 4:30 PM GMT
వివేకా మ‌ర్డ‌ర్ కేసు:  దేవిరెడ్డి పై సీబీఐ చార్జ్ షీటు
X
అనేక మ‌లుపులు తిరుగుతున్న క‌డ‌ప మాజీ ఎంపీ, ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో తాజాగా సీబీఐ మ‌రో చార్జిషీటు దాఖ‌లు చేసింది. సీఎం జ‌గ‌న్‌కు వ‌ర‌సుకు త‌మ్ముడ‌య్యే.. క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు.. ఒక‌ర‌కంగా మిత్రుడుగా చ‌లామ‌ణి అయ్యే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు చార్జిషీట్‌ను వేశారు. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి 5వ నిందితుడిగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా శివశం కర్ రెడ్డి ఉన్నాడు.

గత ఏడాది నవంబరు 17న శివశంకర్ రెడ్డిని హైదరాబాద్‌లో సీబీఐ అరెస్టు చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు గతంలోనే ఒక చార్జిషీటును దాఖలు చేశారు. మొదటి ఛార్జిషీట్లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లను నిందితులుగా సీబీఐ చేర్చింది. ఇప్పుడు రెండో చార్జిషీట్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని నిందితుడిగా పేర్కొన్న సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. అయితే.. వాస్త‌వానికి ఆదిలో దేవిరెడ్డి పేరు తెర‌మీదికి రాలేదు. కానీ, వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత‌.. హైకోర్టులో వేసిన పిటిష‌న్‌లో ప‌లువురిని అనుమానితులుగా పేర్కొన్నారు.

వీరిలో దేవిరెడ్డి కూడా ఉన్నారు. త‌న తండ్రి హ‌త్య కేసులో డాక్ట‌ర్ సునీత కొంద‌రు కుటుంబ స‌భ్యుల‌తో పాటు దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి పేరును కూడా ఆమె ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఈ ఆధారాల‌తో పాటు సీబీఐ విచార‌ణ‌లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. ఈ కేసులో నిందితుడైన ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌గా మారిన నేప‌థ్యంలో ప‌లువురి పేర్ల‌ను ఆయ‌న బయ‌ట పెట్టాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా దేవిరెడ్డిని ఐదో నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఇందులో భాగంగా పులివెందుల కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసింది.

గ‌త ఏడాది న‌వంబ‌ర్ 17న దేవిరెడ్డిని హైద‌రాబాద్‌లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం దేవిరెడ్డి క‌డ‌ప కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ప‌లుమార్లు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో సీబీఐ దూకుడు మ‌రింత‌గా పెరిగింద‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మున్ముందు.. ఎవ‌రెవ‌రు తెర‌మీదికి వ‌స్తారో చూడాలి.