Begin typing your search above and press return to search.

ఒకేసారి 5వేల కెమెరాల విజువల్స్ ....హైదరాబాద్ లో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ !

By:  Tupaki Desk   |   11 Nov 2020 12:30 PM GMT
ఒకేసారి 5వేల కెమెరాల విజువల్స్ ....హైదరాబాద్ లో  క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ !
X
గ‌చ్చిబౌలిలో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ ను హోంమంత్రి మ‌హ‌మ్మ‌ద్ అలీతో క‌లిసి ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ ను ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. డేటా సెంట‌ర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఏక కాలంలో భారీ తెరపై ఐదువేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉంది. 10లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెల రోజుల పాటు నిక్షిప్తం చేసేలా భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ ‌లో 14 మీటర్ల పొడవు, 42 మీటర్ల ఎత్తుతో అర్ధ చంద్రాకారంలో భారీ తెర, దాని పక్కనే రెండు వైపులా 55 అంగుళాల సామర్థ్యం గల మరో నాలుగు టీవీ తెరలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడ నుంచి వీక్షించవచ్చు. ఒక్కో తెర 55 అంగుళాల సామర్థ్యంతో ఉంటుంది. ఈ సెంటర్‌ ను వీక్షించేందుకు 20 సీటింగ్‌ కెపాసిటీతో హాల్ ‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ తెరకు లక్ష సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేయగల కెపాసిటీ ఉంది. ప్రస్తుతం 10 వేల కెమెరాలను అనుసంధానం చేసినట్లు తెలిసింది. ఏక కాలంలో 5వేల కెమెరాల విజువల్స్ ‌ను వీక్షించే సౌలభ్యం ఉండటం ఈ బాహుబలి తెర ప్రత్యేకం. ఈ కమాండ్‌ కంట్రోల్‌ ను బంజారాహిల్స్‌ లోని ప్రధాన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కు అనుసంధానం చేస్తారు. 10 లక్ష కెమెరాల దృశ్యాలను సుమారు నెల రోజుల పాటు నిక్షిప్తం చేసి ఉంచే సామర్థ్యం గల సర్వర్‌ లను ఏర్పాటు చేస్తున్నారు.

కమాండ్‌ కంట్రోల్‌ ప్రత్యేకతలని ఒకసారి చూస్తే ... వేగంగా వెళ్లే వాహనాల నంబర్‌ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్‌ కెమెరాలినీ అందుబాటులోకి తీసుకురానున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ లో భాగంగా కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న కెమెరాలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ఏదైనా కూడలిలో ట్రాఫిక్‌ జాం ఏర్పడితే సమీప కూడళ్ల నుంచి అటు వైపు వాహనాల్ని రానీయకుండా నియంత్రించి.. అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఇలా పలు ప్రాజెక్టుల కింద ఏర్పాటు చేసే లక్షలాది కెమెరాల్ని ఈ కేంద్రం నుంచే వీక్షిస్తారు. అవసరాన్ని బట్టి వీలైనన్ని కెమెరాల్ని జూమ్‌ చేసి దృశ్యాల్ని వీక్షించొచ్చు. భవిష్యత్తులో పబ్లిక్‌ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ కు డయల్‌- 100ను అనుసంధానించనున్నట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు.