Begin typing your search above and press return to search.

పవన్ ప్రటకన చేశాడో లేదో..

By:  Tupaki Desk   |   12 April 2016 11:00 AM GMT
పవన్ ప్రటకన చేశాడో లేదో..
X
2019 ఎన్నికలు జరగడానికి ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి కూడా రెండేళ్ల పైనే సమయం పట్టొచ్చేమో. కానీ రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతానని ప్రకటించడం ఆలస్యం.. ఇప్పుడే అతణ్ని తమ వైపు తిప్పేసుకుందామని తెలుగుదేశం.. భారతీయ జనతా పార్టీ పోటీకి దిగుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు తీవ్రమవుతున్న సమయంలో పవన్ ప్రకటన రావడంతో.. అతణ్ని చేజిక్కించుకునే విషయంలోనూ ఇద్దరి మధ్య వైరం మొదలైపోయింది.

ఆల్రెడీ తెలుగుదేశం నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మీడియా ముందుకొచ్చేసి.. పవన్ తో పొత్తు పెట్టుకునే విషయం వరకు మాట్లాడేస్తే.. భాజపా తరఫున బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి.. పవన్ ను తమ పార్టీలోకి ఆహ్వానించేశాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తాననడం మంచి విషయమే అని.. ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆయన వస్తే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని విష్ణువర్ధన్ పేర్కొన్నారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం-భాజపా మధ్య సంబంధాలు తెగిపోయాయని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు పార్టీలు మారడంపై నీతి వాక్యాలు వల్లించిన పవన్.. తెలుగుదేశం పార్టీ చేస్తున్న నీతిమాలిన పనులపై ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు డబ్బు పెట్టి కొన్న ఎమ్మెల్యేలను ఉగాది రోజున పార్టీలోకి ఆహ్వానించడం దారుణమని.. ప్రజల కోసం పోరాడుతానని.. ప్రశ్నిస్తానని చెప్పే పవన్.. ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని అన్నారు. సినిమాలు లేకపోవడంతోనే పవన్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానంటున్నారని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని మోదీతో మాట్లాడే దమ్ము..ధైర్యం పవన్ కు ఉందా అని ప్రశ్నించారు.