Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేకు కాంట్రాక్టులు ఇస్తే కామయిపోతారట

By:  Tupaki Desk   |   5 Dec 2015 7:19 AM GMT
ఆ ఎమ్మెల్యేకు కాంట్రాక్టులు ఇస్తే కామయిపోతారట
X
మిత్రపక్షాలు బీజేపీ - టీడీపీ మధ్య వేడి ఈ మధ్య కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది... ఏపీ బీజేపీలో కండలు చూపించిన నేతలంతా బీహార్ ఎన్నికల్లో బీజేపీ రంగు వెలిసిపోయిన తరువాత కామ్ అయిపోయారు. అయితే... ఈసారి ఆ మిత్రబేధం రాష్ట్రస్థాయిలో కాకపోయినప్పటికీ ఇంకోచోట మొదలైంది. సాక్షాత్తు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కొలువున్న విశాఖ కేంద్రంగా టీడీపీ - బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ కొత్త వివాదాలకు విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెరతీస్తున్నారు.

విశాఖపట్నంలోని ఉత్తర నియోజకవర్గంలో టిడిపి - బిజెపి మధ్య విభేదాలు బాగా ముదిరిపోయాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అంతకుముందు శాససనభలో పలు సందర్భాల్లో పెద్ద మనిషిలా వ్యవహరించిన బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు కూడా ఇప్పుడు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు విశాఖలో బిజెపి నేతల మధ్య కూడా విభేదాలున్నాయి. 2014 ఎన్నికల్లో సీట్లు సర్దుబాటులో భాగంగా విశాఖ నార్త్ నియోజకవర్గం బిజెపికి దక్కింది. ఈ నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్‌ రాజు పోటీ చేసి విజయం సాధించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ రావడం లేదంటూ ఆయన కొద్దికాలంగా రగిలిపోతున్నారు. స్వతహాగా కాంట్రాక్టరు కావడంతో ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులతో చేపట్టే పనుల కాంట్రాక్టును దక్కించుకోవాలనే ఆలోచన. దీనికి మంత్రులు సహకరించకపోవడంతో ఇటీవల ఒక స్థానిక ఛానల్‌ లో కూడా తన పనుల్లేమీ కావడం లేదని, ప్రజలకు అభివృద్ధి చేరువకావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు లక్ష మందితో ధర్నా చేస్తే గానీ ఈ ప్రభుత్వానికి బుద్ధిరాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి వద్ద పనులు ఫైలు పెండింగ్‌ లో ఉందని తామేమీ చేయలేమంటూ జిల్లాకు చెందిన గంటా - అయ్యన్న చేతులెత్తేయడంతో విష్ణుకుమార్‌ రాజు అసహనంతో రగిలిపోతున్నారు.

మరోవైపు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు తీరుపై టీడీపీ నేతలు అహసనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వపరంగా జరిగే కార్యక్రమాల గురించి తమతో సంప్రదించడం లేదంటూ టిడిపి నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌ కుమార్‌ కు నేతలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. టిడిపి నేతలు తమను పట్టించుకోవడం లేదంటూ బిజెపి కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో టిడిపి - బిజెపి కార్యకర్తలు ఘర్షణకు దిగిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. బిజెపితో టిడిపికున్న చెలిమిని దృష్టిలో పెట్టుకుని టిడిపి నేతలు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి. కాగా ఉత్తర నియోజకవర్గంలో బిజెపి మధ్య కూడా విభేదాలున్నాయి. 32వ వార్డు బిజెపి అధ్యక్షుడు - ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మధ్య ఉన్న భేదాభిప్రాయాలు రచ్చకెక్కుతున్నాయి. తెలుగుదేశం శ్రేణులతోనే కాకుండా తమ పట్ల కూడా ఎమ్మెల్యే అలానే వ్యవహరిస్తున్నారని బిజెపి కార్యకర్తలు వాపోతున్నారు. ఎమ్మెల్యే విష్ణుకు కాంట్రాక్టులు ఇస్తే ఆయన కామ్ గా ఉంటారని అంటున్నారు. అదన్నమాట అసలు కథ.