Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాద‌యాత్ర లెక్క చెప్పిన బాబు మిత్రుడు

By:  Tupaki Desk   |   25 Oct 2017 9:58 AM GMT
జ‌గ‌న్ పాద‌యాత్ర లెక్క చెప్పిన బాబు మిత్రుడు
X
తెలుగు ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా చూస్తున్న అంశాల్లో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఒక‌టి. పాద‌యాత్ర‌కు వెళ్ల‌టంతో ఏపీ విప‌క్ష నేత‌కు భారీ రాజ‌కీయ మైలేజీ రావ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సుదీర్ఘ పాద‌యాత్ర పుణ్య‌మా అని మూడున్న‌రేళ్లుగా బాబు పాల‌న‌లోని లోపాల పుట్ట ప‌గల‌టం ఖాయ‌మ‌ని.. నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త తెర మీద‌కు వ‌స్తుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

పేరుకు ఏపీ అధికార‌ప‌క్షానికి మిత్రుడే అయినా.. విమ‌ర్శించాల్సి వ‌చ్చిన‌ప్పుడు మొహ‌మాటం ప‌డ‌కుండా విమ‌ర్శించే బీజేపీ నేత‌.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాజాగా జ‌గ‌న్ పాద‌యాత్ర మీద రియాక్ట్ అయ్యారు. ఏ విష‌య‌మైనా మ‌న‌సులో దాచుకోకుండా మాట్లాడే త‌త్త్వం ఉన్న ఆయ‌న జ‌గ‌న్ పాద‌యాత్రతో విపక్షానికి ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

బ‌స్సు యాత్ర‌తోనో.. ఫ్లైట్ యాత్ర‌తోనో ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న రాజు.. పాద‌యాత్ర‌తోనే ప్ర‌యోజ‌న‌మ‌న్నారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా వారానికి రెండు రోజులు జ‌గ‌న్ విరామం తీసుకోవ‌టం మంచిద‌న్న ఆయ‌న‌.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు గైర్హాజ‌రు కావాల‌నుకోవ‌టం స‌రికాద‌న్నారు.

అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షం లేక‌పోతే చ‌ప్ప‌గా ఉంటుంద‌న్న విష్ణుకుమార్ రాజు.. అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌గ‌న్ రావ‌టం బాగుంటుంద‌న్నారు. ఇటీవ‌ల కాలంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పాద‌యాత్ర కానీ బ‌స్సు యాత్ర కానీ చేస్తారంటూ వ‌స్తున్న వార్త‌ల మీద స్పందించారు.

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌భంజ‌నం లాంటి మాట‌లు అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌జ‌ల్లోకి ప‌వ‌న్ వెళ్ల‌టం మంచిదే అయినా.. ఆయ‌న యాత్ర ఎంత‌కాలం చేస్తారో చూడాల‌న్న మాట‌ను చెప్ప‌టం గ‌మ‌నార్హం. పాద‌యాత్ర‌తో జ‌గ‌న్‌ కు మైలేజీ వ‌స్తుంద‌న్న టీడీపీ మిత్రుడి మాట‌ తెలుగు త‌మ్ముళ్లకు చిరాకు తెప్పించ‌క మాన‌దు.