Begin typing your search above and press return to search.

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన విశాల్

By:  Tupaki Desk   |   14 Sep 2020 12:10 PM GMT
బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన విశాల్
X
తమిళనాడు రాజకీయాల్లో అమ్మ జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడింది. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రాజకీయ పార్టీలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఓవైపు కమల్ హాసన్, మరోవైపు రజనీకాంత్ రావడానికి ఎదురుచూస్తున్నారు. ఇక కొత్తగా హీరో విజయ్ కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు హీరో విశాల్ పేరు కూడా వినిపిస్తోంది.

రాజకీయాల్లోకి హీరో విశాల్ వస్తున్నానంటూ తమిళనాట భారీగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై విశాల్ క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీ లో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నాడు ప్రముఖ తమిళ సినీ నటుడు విశాల్. విశాల్‌ గతంలో నడిగర్‌ సంఘం, సినీ నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత ఖాళీపడిన ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసేందుకు నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. ఆఖరి క్షణంలో ఆ నామినేషన్‌ను ప్రతిపాదించిన వారిలో కొందరు తమ పేర్లను ఉపసంహరించుకోవడంతో విశాల్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తోసిపుచ్చారు.

తాజాగా.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీల్లోనూ కొంత సినీ గ్లామర్‌‌ కనిపించాలని తాపత్రయపడుతున్నాయి. దీంతో సినీనటీనటులను చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే విశాల్‌ కూడా బీజేపీ గూటికి చేరుతున్నారని వార్తలు వచ్చాయి.

అంతేకాదు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ అడిగారని వినిపించింది. దీంతో స్పందించిన విశాల్‌ ఓ తమిళ టీవీ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వాటన్నింటినీ కొట్టిపారేశారు. తాను బీజేపీ లో చేరే ప్రసక్తే లేదని అంటున్నారు.