Begin typing your search above and press return to search.

వాల్తేర్ క్లబ్ చుట్టూ విశాఖ రాజకీయాలు

By:  Tupaki Desk   |   8 Feb 2020 6:30 AM GMT
వాల్తేర్ క్లబ్ చుట్టూ విశాఖ రాజకీయాలు
X
విశాఖ రాజకీయాలు వాల్తేర్ క్లబ్ చుట్టూ తిరుగుతున్నాయి. విశాఖలోని వాల్తేర్ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోనంటూ వైఎస్సార్సీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హెచ్చరిస్తున్నారు. వాల్తేర్ క్లబ్ భూములను టీడీపీ వారు ఆక్రమించి పార్టీ కార్యాలయం కడుతున్నారని విమర్శించారు. అయితే ప్రభుత్వ పెద్దలే వాల్తేర్ క్లబ్ విషయంలో ఎసరు పెడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుండగా అధికార పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడం తో ఆసక్తి రేపుతున్నాయి.

పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్న అనంతరం శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ ఎంపీల మధ్య వాల్తేర్ క్లబ్ భూముల విషయంలో చర్చ జరిగింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతుండగా రఘురామ కృష్ణంరాజు ఈ వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు క్లబ్ జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మిగిలిన ఇద్దరు ఎంపీల ముందు చెప్పారు. తాను కూడా వాల్తేర్ క్లబ్‌లో సభ్యుడినేనని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు క్లబ్ జోలికి ఎవరొచ్చినా ఊరుకోనని స్పష్టం చేశారు.

అయితే రఘురామకృష్ణ రాజు వైఖరికి వైఎస్సార్సీపీ పార్టీకి విరుద్ధంగా సాగుతోంది. దీంతో అతడి వైఖరిపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. కేంద్ర బడ్జెట్‌కు మెచ్చుకోవడం, ప్రధానమంత్రి ప్రసంగంపై ప్రశంసలు కురిపించాడు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా.. బీజేపీ పెద్దలకు సన్నిహితంగా ఉంటున్నాడని తెలుస్తోంది. అతడు పార్టీ ఆదేశాలను పట్టించుకోక పోవడంతో పార్టీ దూరం పెట్టిందని తెలుస్తోంది. చివరికి ఇవి ఎక్కడకు దారి తీస్తాయో వేచి చూడాలి.