Begin typing your search above and press return to search.

మోడీపై పోటీకి విశాఖ కుర్రాడు బ‌రిలోకి దిగాడు

By:  Tupaki Desk   |   3 May 2019 6:50 AM GMT
మోడీపై పోటీకి విశాఖ కుర్రాడు బ‌రిలోకి దిగాడు
X
ప్ర‌ధానమంత్రి మోడీ పోటీ చేస్తున్న వార‌ణాసి ఎంపీ స్థానాన్ని ప‌లువురు టార్గెట్ చేస్తున్నారు. ప్ర‌ధాని పోటీ చేసిన స్థానం నుంచి పోటీ చేయ‌టం ద్వారా జాతీయ స్థాయిలో అంద‌రి క‌ళ్లు త‌మ మీద ప‌డేలా చేయ‌టం.. పోటీ వెనుక త‌మ‌కున్న కార‌ణాల్ని ప్ర‌చారంలోకి తీసుకురావ‌టం ద్వారా.. త‌మ స‌మ‌స్య‌ల‌కు జాతీయ స్థాయిలో ప్రాచుర్యం క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ‌లోని నిజామాబాద్ కు చెందిన ప‌సుపు రైతులు పాతిక‌మంది నామినేష‌న్ దాఖ‌లు చేయ‌టం తెలిసిందే. ఇందులో ఒక్క‌రి నామినేష‌న్ మిన‌హా మిగిలిన 24 మంది నామినేష‌న్లు తిర‌స్క‌ర‌ణ‌కు గురి కావ‌టం తెలిసిందే. వాస్త‌వానికి వార‌ణాసిలో ప‌సుపురైతులు మొత్తం వంద నామినేష‌న్లు వేయాల‌ని భావించారు. అదే జ‌రిగితే.. ఒక్క‌సారిగా త‌మ డిమాండ్ అయిన ప‌సుపుబోర్డు ఏర్పాటు అంశం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తుంద‌ని భావించారు.

అయితే.. ఈ రైతుల వెనుక టీఆర్ ఎస్ పార్టీ ఉండి చేస్తుంద‌న్న విమ‌ర్శ ఉంది. అదే స‌మ‌యంలో.. వార‌ణాసిలో తాము నామినేష‌న్ వేసేందుకు స్థానిక అధికారులు.. పోలీసులు.. రాజ‌కీయ నేత‌లు తెగ ఇబ్బంది పెడుతున్న‌ట్లుగా ప‌లువురు ప‌సుపు రైతులు ఆరోపించారు.

మొత్తంగా పాతిక నామినేష‌న్లు వేసినా.. ఒక్క‌దానికి మాత్ర‌మే ఆమోదం ల‌భించింది. మిగిలిన 24 నామినేష‌న్ల‌లో లోపాలు ఉండ‌టంతో వాటిని తిరస్క‌రించిన‌ట్లుగా అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఇదంతా రాజ‌కీయ కుట్ర అని.. ఎన్నిక‌ల సంఘాన్ని బీజేపీ త‌మ‌కు అనువుగా వాడేసుకుంద‌న్న విమ‌ర్శ చేశారు టీఆర్ ఎస్ నేత‌లు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌ధాని మోడీ బ‌రిలో ఉన్న వార‌ణాసిలో మోడీపై పోటీకి దిగారు విశాఖ‌కు చెందిన ఒక కుర్రాడు.

విశాఖ‌లోని విశాలాక్షి న‌గ‌ర్ కు చెందిన మాన‌వ్ అనే యువ‌కుడు ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలోకిదిగారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ మ‌ధ్య‌న ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. మ‌రి.. ఈ కుర్రాడి పోటీకి ఎజెండా ఏమిట‌న్న విష‌యం బ‌య‌ట‌కు రాలేదు.