Begin typing your search above and press return to search.

నవ్యాంధ్రలో ఫస్ట్ మెట్రో సిటీగా వైజాగ్

By:  Tupaki Desk   |   21 Nov 2015 12:41 PM IST
నవ్యాంధ్రలో ఫస్ట్ మెట్రో సిటీగా వైజాగ్
X
నవ్యాంధ్రలో మొట్టమొదటి మెట్రో నగరంగా విశాఖపట్నం రూపుదిద్దుకోబోతుంది. విశాఖపట్టణాన్ని మెట్రో మహా నగరంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ తరహాలో వైజాగ్‌ కూ ఒక అథారిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మున్సిపల్‌ శాఖ వైజాగ్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డవలప్‌ మెంట్‌ అథారిటీ (విఎంఆర్‌ డిఎ) చట్టం 2015 చట్టం ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ మెట్రో మహా నగరం ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం వుడా పరిధిలోని 5,573 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని 7,086 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని ప్రతిపాదిస్తున్నారు.

వుడా పరిధిలో ప్రస్తుతం దాదాపు 55 లక్షల జనాభా ఉంటారు. కొత్తగా మెట్రో మహా నగరం పరిధిలోకి శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్టణం - తూర్పుగోదావరి.. ఈ నాలుగు జిల్లాలలోని 50 మండలాలు, 1453 గ్రామాలు వస్తాయి. విలీనం తర్వాత జన సంఖ్య 60.53 లక్షలకు చేరుతుందని అంచనా. హెచ్‌ ఎమ్‌ డిఎ నమూనాలోనే ఏర్పాటు చేసే విఎంఆర్‌ డిఎ విశాఖ మెట్రో మహా నగరంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి కృషి చేస్తుందని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. హెచ్‌ ఎమ్‌ డిఎ తరహాలోనే విఎంఆర్‌ డిఎ కూడా తన పరిధిలోని మునిసిపల్‌ కార్పొరేషన్లు - స్థానిక సంస్థలు - వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డ్‌ - ఎపిఐఐసి - ఆర్‌ టిసి - ట్రాన్స్‌ మిషన్‌ కార్పొరేషన్‌ - వంటి వివిధ సంస్థల మధ్య సమన్వయంతో మెట్రో మహా నగర ప్రణాళికాబద్ధ అభివృద్ధికి దోహదపడుతుందని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. ఎపిలో విజిటిఎం ఉడా పరిధిని విస్తరించి క్యాపిటల్‌ రీజియన్‌ డవలప్‌ మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే.

వైజాగ్‌ మెట్రో రీజియన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ ఏర్పాటైతే దానికి రూ.100కోట్ల విలువైన పనులు చేపట్టే అధికారంలభిస్తుంది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి ఛైర్మన్‌ గా ఉంటారు. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కమిషనర్‌ గా వ్యవహరిస్తారు. మునిసిపల్‌ శాఖ రూపొందించిన ముసాయిదా చట్టాన్ని నెలాఖరుకు క్యాబినెట్‌ కు పంపుతారు. డిసెంబరులో జరిగే శీతాకాల సమావేశాలలో శాసనసభ ఆమోదానికి పెడతారు. ఈ ప్రక్రియంతా పూర్తయితే విశాఖ మెట్రో సిటీ అవుతుంది.