Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు సత్తాను ఒప్పుకున్న మోడీ సర్కార్

By:  Tupaki Desk   |   12 Aug 2021 11:30 AM GMT
విశాఖ ఉక్కు సత్తాను ఒప్పుకున్న మోడీ సర్కార్
X
మోడీ సర్కారు నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. నష్టాల ముద్ర వేసి.. ప్రైవేటు పరం చేయాలని టార్గెట్ చేసిన సంస్థల్లో విశాఖ ఉక్కు కర్మాగారం ఒకటన్న సంగతి తెలిసిందే. లాభాల బాటలో నడుస్తున్న సంస్థను.. కొనసాగించకుండా అమ్మేసేందుకు ప్లాన్ చేసిన మోడీ సర్కారు తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. కేంద్రం తీరును తప్పు పడుతూ చేపట్టిన ఆందోళనను పట్టించుకోకుండా ఉన్న కేంద్రం.. తాజాగా విశాఖ ఉక్కు గురించి చెప్పి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుందని చెప్పాలి.

విశాఖ ఉక్కుపై రాజ్యసభలో ఎంపీ సరోజ్ పాండ్యా ఒక ప్రశ్నను వేశారు. దీనికి ఉక్కుశాఖా మంత్రి రామచంద్ర ప్రసాద్ లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. 2020-21లో విశాఖ ఉక్కు పరిశ్రమ 13.079 లక్షల టన్నుల ఉక్కును ఎగుమతి చేసినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా రూ.4,043 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. విశాఖ ఉక్కును పదమూడు దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

విశాఖ ఉక్కును చైనా.. ఇండోనేషియా.. మలేషియా.. కెన్యా.. శ్రీలంక.. మయన్మార్.. నేపాల్.. ఫిలిపిన్స్.. థాయిలాండ్.. టర్కీ.. యూఏఈ.. టాంజనియా.. మోజాంబియా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తామని వెల్లడించారు. 2018-19తో పోలిస్తే 2020-2021లో ఎగుమతులు బాగా పెరిగినట్లు చెప్పారు. 2020-21లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొత్తం ఉత్పత్తి 43 లక్షల టన్నులని చెప్పిన మంత్రి.. గడిచిన ఎనిమిది నెలల్లో ఈ ప్లాంట్ లో మొత్తం ఐదు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లుగా మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మొత్తంగా విశాఖ ఉక్కు పని తీరు బాగుందన్న విషయాన్ని.. లాభాల్లో ఉందన్న విషయాన్ని చెప్పారు. మరి.. లాభాల్లో ఉన్న పరిశ్రమను ప్రైవేటు సంస్థలకు అమ్మాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్న. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని రాజకీయ నేతలు గుర్తు చేసుకోవాల్సిన అవసరంఉంది. విశాఖ స్టీల్ సత్తా ఏమిటన్న విషయాన్ని రాజ్యసభలో కేంద్రమంత్రే స్వయంగా చెప్పిన నేపథ్యంలో.. ఇప్పటికైనా ఈ ఇష్యూ మీద మరింత ఘాటుగా ఏపీ నేతలు రియాక్టు కావాల్సిన అవసరం ఉంది.