Begin typing your search above and press return to search.

ఉక్కు ఉద్యమం @ 400... లెక్క చేస్తున్నారా...?

By:  Tupaki Desk   |   18 March 2022 12:32 PM GMT
ఉక్కు ఉద్యమం @ 400... లెక్క చేస్తున్నారా...?
X
విశాఖ ఉక్కు కర్మాగారం ఏపీకే గర్వకారణం. విశాఖ ఉక్కు కోసం 32 మంది అమరులు అయ్యారు వందలాది మంది జైలు పాలు అయ్యారు. అరవై దశకం మధ్యలో విశాఖ సాగర తీరాన చెలరేగిన ఉక్కు పోరాటం లక్ష్యాన్ని తాకేవరకూ కొన‌సాగింది. నాడు ఉమ్మడి ఏపీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి స్వయంగా విశాఖ వచ్చి నాడు అమరణ దీక్ష చేస్తున్న ఉద్యమ నేత అమృత రావుకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా జీవో చూపించి ఆయన చేత నిమ్మరసం తాగించారు.

ఇక ఇప్పటికి యాభై అయిదేళ్ల క్రితం విశాఖ ఉక్కు కోసం పాతిక వేల ఎకరాలను ఇచ్చారు ఈ రోజు వాటి విలువ ఎన్నో లక్షల కోట్లు. తమ బిడ్డ‌లకు ఉపాధి వస్తుందని, విశాఖ బాగుపడుతుందని నాడు వారు అతి పెద్ద త్యాగాలు చేశారు. అలా నిర్వాసితులైన వారిలో ఇంకా వేలాది మందికి ఈ రోజుకూ న్యాయం జరగలేదు.

ఇవన్నీ ఇలా ఉండగానే విశాఖ ఉక్కుకు నూరేళ్ళూ నిండిపోయేలా పాలకులు చేస్తున్నారు. బంగారం లాంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. విశాఖ ఉక్కుకు దేశంలోనే ప్రత్యేకత ఉంది. సాగర తీరంలో ఏర్పాటు చేసిన ఏకైక ఉక్కు కర్మాగారం ఇదే కావడం విశేషం.

ఇక అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో విశాఖ ఉక్కు తయారవుతుంది. దానికి అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది. విశాఖ ఉక్కు కెపాసిటీని మరింతగా పెంచుకుని లాభాలను ఆర్జించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే నష్టాల సాకు చూపించి తెగనమ్మాలని చూస్తున్నారని కార్మిక లోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. వాటిని ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా కేటాయించ అన్యాయమే చేసింది. దాంతోనే ఉక్కుకు నష్టాలు వస్తున్నాయని నివేదికలు చెబుతున్నా కూడా ఉక్కుని వదిలించుకోవాలని పాలకులు చూస్తున్నారు. విశాఖ ఉక్కుని సొంతం చేసుకోవాలని ఆదాని, జిందాల్ వంటి సంస్థలు చూస్తున్నాయి. అదే సమయంలో వేలాది ఎకరాల భూములు ఇచ్చిన నిర్వాసితుల జీవితాలు ప్రశ్నార్ధకం అయ్యాయి.

అదే విధంగా చూసుకుంటే ప్రత్యక్షంగా యాభై వేల మంది ఉద్యోగులు ఉన్నారు. పరోక్షంగా మరో లక్షన్నర మంది బతుకుతున్నారు. వీరందరి మనుగడ కూడా సందేహంలో పడింది. ఈ నేపధ్యంలో గత ఏడాది విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం పేర్కొనడంతో నాటి నుంచి ఉద్యమం విశాఖ వాకిట మొదలైంది. అది కాస్తా ఈ మార్చి 18 నాటికి సరిగ్గా నాలుగు వందల రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా ఉద్యమకారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.విశాఖ ఉక్కుని కాపాడుకుంటామమని ప్రతిన పూనారు. ఇక మీదట పోరాటాలు ఢిల్లీ వేదికగా ఉంటాయని చెప్పుకొచ్చారు. తమకు వంద మందికి పైగా ఎంపీల మద్దతు ఉందని వారు పేర్కొన్నారు. మోడీ సర్కార్ విశాఖ ఉక్కు ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో బీజేపీ తప్ప అన్ని పార్టీల మద్దతు తమకు ఉందని వారు అంటున్నారు. మొత్తానికి నాలుగు వందల రోజులుగా విశాఖ ఉక్కు ఉద్యమం సాగుతున్నా కేంద్రం లెక్క చేస్తోందా అంటే జవాబు నిరాశగానే ఉంటోంది.

విశాఖ ఉక్కు విషయంలో ప్రజా సంఘాలు కలసి వచ్చినా రాజకీయ పార్టీలు పెద్దగా ముందుకు రాకపోవడంతో బలమైన ఉద్యమం నిర్మించలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇంకో వైపు రాజకీయంగానే దీన్ని అడ్డుకోవాలి. కానీ ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ అనైక్యతతో ఉండడం, ఎవరి అజెండా వారిది కావడంతో కేవలం ఉక్కు కార్మికుల భుజాల మీదనే ఉద్యమ భారం పడింది. అయినా సరే తాము తగ్గేదే లే అని వారు అంటున్నారు. మరి ఇప్పటికైనా కేంద్రం కరుణిస్తుందా, ఉక్కు పై వేటుని వేయకుండా ఆగుతుందా. చూడాలి.