Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు తుక్కుకు...బెజవాడ ఎయిర్ పోర్ట్ ప్రైవేట్ షెడ్డుకు

By:  Tupaki Desk   |   24 Jan 2023 9:24 AM GMT
విశాఖ ఉక్కు తుక్కుకు...బెజవాడ ఎయిర్ పోర్ట్ ప్రైవేట్ షెడ్డుకు
X
విశాఖలో బంగారం లాంటి ఉక్కు కర్మాగారం మీద కేంద్రం కన్ను పడింది. అంతే అది తుక్కు అయిపోతోంది. రెండేళ్ల క్రితం బడ్జెట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కే అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఆ మీదట ఎవరు ఎంతలా తన్నుకున్న గింజుకున్నా ఉక్కు విషయంలో అడుగు వెనక్కు పడలేదు. పైగా ఆంధ్రుల ఆత్మగౌరవానికి గర్వానికి ప్రతీకగా ఉన్న విశాఖ స్టీల్ మీద ఉక్కు మంత్రులు ఎన్ని మాటలని అన్నారు. విశాఖ ఉక్కుకు నష్టాలు కష్టాలు వస్తున్నాయి ఇక మా వల్ల కాదు మేము ఏమీ చేయలేమని నిండు పార్లమెంట్ లో చేతులెత్తేశారు.

మీరు ఎంతలా మొరపెట్టుకున్నా మేము వినం కాక వినమని కూడా చెవులు మూసేసుకున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ కధ టీవీ సీరియల్ గా సాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంటే దీన్ని మరచిపోయే రేంజిలో మరో షాకింగ్ ట్రీట్మెంట్ కి కొత్త బడ్జెట్ లో సరికొత్తగా వంట వండుతోంది కేంద్రం. ఈ విషయాన్ని జాతీయ మీడియా కోడే కూయడంతో లేటెస్ట్ గా తెలుస్తున్న కబురు ఏంటి అంటే విజయవాడ ఎయిర్ పోర్ట్ కూడా ప్రైవేట్ షెడ్డుకేనట.

ఆ విషయం కేంద్రం బడ్జెట్ లో సవివరంగా చెప్పబోతోందిట. విజయవాడ ఎయిర్ పోర్టు సహా దేశంలోని జైపూర్, ఇండోర్, కోల్ కతా వంటి పన్నెండు ఎయిర్ పోర్టుల జాబితాను కేంద్రం రెడీ చేసి ఉంచిందట.

వీటిని ప్రైవేటుకు అప్పగిస్తే కేంద్రానికి ఏకంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందిట. అందుకే ప్రైవేట్ కి జై అంటోంది అని జాతీయ మీడియా కధనాలు వెల్లడిస్తున్నాయి.

ఈ జాబితాలో ఏపీలో ఉన్న మరో రెండు రాజమండ్రి, తిరుపతి ఎయిర్ పోర్టులు ఉన్నాయా అంటే బడ్జెట్ లో చూడాల్సినే అంటున్నారు. అయితే ఈ రెండు ఎయిర్ పోర్టులకు ప్రైవేట్ ముప్పు పొంచి ఉందని రెండేళ్ళ క్రితమే పౌర విమానయానశాఖ సహాయమంత్రి వీకే సింగ్ పార్లమెంట్ కి చెప్పుకొచ్చారు. అంటే వీటికి కూడా సర్వమంగళం అన్న మాట.

ముందుగా ప్రధాన విమానాశ్రయం కాబట్టి విజయవాడతో మొదలెడుతున్నారు అనుకోవాలి. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను ప్రైవేటుకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలలో భాగంగానే ఇపుడు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇందులో విశాఖ ఎయిర్ పోర్టు లేదు అంటే అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినది. విమానయాన ప్రయాణీకుల కోసం వారికి మెరుగైన సదుపాయాల కోసం ప్రైవేట్ పెట్టుబడులు ఆకట్టుకోవడం తప్పనిసరి అని కేంద్రం భావిస్తోంది. అందుకే ఇలా చేస్తోంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.