Begin typing your search above and press return to search.

విశాఖ మెట్రో రైల్ కూతను ఆపిందెవరు... ?

By:  Tupaki Desk   |   28 March 2022 3:30 PM GMT
విశాఖ మెట్రో రైల్ కూతను ఆపిందెవరు... ?
X
విశాఖ అంటేనే ఏపీలో ఏకైక మెగా సిటీ. ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అలాంటి విశాఖకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ తెస్తామని పాలకులు చెబుతున్న కబుర్లు ఆచరణలో మాత్రం అడుగు ముందుకు వేయలేకపోతున్నాయి. మరి దీని వెనక కారణం ఏంటి, ఎవరిది నిర్లక్ష్యం అంటే మాత్రం ఇదిగో ఆధారసహితంగా చెబుతున్నాం, వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలదే తప్పు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అంటున్నారు.

ఆయన రాజ్యసభలో తాజాగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టునకు సంబంధించి కేంద్రానికి ఏపీ సర్కార్ ఇంతవరకూ ఎలాంటి ప్రతిపాదన సమర్పించలేదని కేంద్రం పేర్కొనడం విశేషం. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదనలను కేంద్రం 2017 సెప్టెంబర్ లోనే కోరిందని కూడా పేర్కొనడం గమనార్హం.

అయితే దానికి ఏపీ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు ఇప్పటిదాకా రానేలేదని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం 12,345 కోట్ల రూపాయలతో 42.55 కిలోమీటర్ల పొడవుతో మెట్రో రైలు నెట్‌వర్క్ కోసం గతంలో ప్రతిపాదనను సమర్పించిందని, అయితే తర్వాత దానిని కొనసాగించలేదని మంత్రిత్వ శాఖ నుంచి జవాబు వస్తోంది.

కేంద్రం దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల కోట్లతో పలు మెట్రో నగరాల్లో ఇప్పటికి 23 మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతించింది. ఈ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం 20 శాతం నిధులను ఇస్తుంది. మరి దాన్ని ఉపయోగించుకుంటే విశాఖలో కూడా మెట్రో రైలు కూత పెడుతుంది. కానీ అలాంటి ప్రతిపాదనే తమ వద్దకు రాలేదని కేంద్రం చెప్పడం అంటే షాకింగ్ న్యూసే మరి.

ఇక దీని మీద జీవీఎల్ అయితే ఫైర్ అవుతున్నారు. దీన్ని బట్టి చూస్తూంటే నాటి టీడీపీ కానీ ప్రస్తుత వైసీపీ కానీ ఎలాంటి ప్రతిపాదన పంపలేదని అర్ధమవుతోంది అని ఆయన అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ సర్కార్ విశాఖ మెట్రో రైల్ కోసం ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రపంచంతో అన్ని రకాలుగా కనెక్ట్ అయి ఉన్న విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్ట్ అవసరం అని ఆయన అంటున్నారు.