Begin typing your search above and press return to search.

విశాఖే రాజధాని ... ఆ రోజే భారీ ప్రకటన.. ?

By:  Tupaki Desk   |   6 Dec 2021 1:04 PM GMT
విశాఖే  రాజధాని ... ఆ రోజే భారీ ప్రకటన.. ?
X
విశాఖ రాజధాని అవుతుందా అంటే అవును అనే అంటున్నారు. విశాఖ మీద వైసీపీ సర్కార్ పెద్దలకు మోజు రోజు రోజుకీ ఎక్కువ అయిపోతోందిట. దాంతో సరైన సమయం చూసి విశాఖనే రాజధానిగా చేసుకోవాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసినా కూడా వైసీపీ ఆలోచనలు విశాఖ చుట్టూనే తిరుగుతున్నాయని అంటున్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించడం ఖాయమని వైసీపీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను రెండేళ్ళ క్రితం ప్రకటించిన జగన్ ఈ మధ్యనే ఆ చట్టాన్ని అసెంబ్లీ సాక్షిగా రద్దు చేసుకున్నారు. దాంతో అంతా సంబరపడ్డారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని కూడా భావించారు. అయితే ఇదే సందర్భంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలను వింటే కచ్చితంగా ప్రభుత్వం మూడు రాజధానుల నుంచి వెనక్కి పోలేదని అర్ధమవుతుంది. అంతే కాదు బుగ్గన పదే పదే విశాఖ నగరం గురించి ప్రస్థావించారు.

అయిదు పదేళ్ళలో హైదరాబాద్ తో పాటు చెన్నై, బెంగళూరు, ముంబై వంటి మెగా సిటీస్ తో పోటీ పడాలి అంటే విశాఖను మించిన నగరం వేరొకటి లేదు అని కూడా ఆయన అన్నారు. ఇక విశాఖకు రైల్, రోడ్, ఎయిర్, సీ పోర్ట్ కనెక్టివిటీ ఉందని చెప్పారు. పెట్టుబడులకు స్వర్గధామం కూడా అవుతుందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ మనసులో విశాఖే రాజధాని అని అంతా భావిస్తున్నారు. లేటెస్ట్ గా జగన్ కి సన్నిహితుడు అయిన మరో మంత్రి బాలినేని శ్రీనివాసరావు మూడు రాజధానుల బిల్లు అసెంబ్లెలో బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడతామని కూడా పేర్కొన్నారు.

దాంతో రాజధానుల కధకు కంటిన్యూటీ కొత్త ఏడాదే ఉంటుందని భావిస్తున్నారు. ఇక మూడు రాజధానులు అని కొత్త బిల్లులో ఎక్కడా ఉండబోదని కూడా తెలుస్తోంది. మూడుకి ఆ విధంగా మూడినట్లేనని, విశాఖనే ఏకైక రాజధానిగా ప్రకటించి ముందుకు సాగాలని జగన్ సర్కార్ గట్టిగా తీర్మానించుకుందని చెబుతున్నారు. ఇక విశాఖ రాజధానిగా ప్రకటించడానికి ముహూర్తాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఉగాదికే కొత్త రాజధాని ప్రకటన ఉంటుందని, కాస్తా అటూ ఇటూ అయితే శ్రీరామ నవమి వేళ అయినా ప్రకటన ఉంటుంది అంటున్నారు. మరి ఈ రెండింటిలో ఏ ముహూర్తాన్ని ఎంచుకుంటారో తెలియదు కానీ డ్యామ్ ష్యూర్ గా విశాఖే ఏపీకి అసలైన సిసలైన రాజధాని అంటున్నారు. అది కూడా ఏకైక రాజధానిగా కూడా ప్రకటించి అక్కడ నుంచే కధ స్పీడ్ గా తీసుకెళ్తారని కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఈ ప్రచారం ఎంతవరకూ నిజమవుతుందో.