Begin typing your search above and press return to search.

మెరుపువేగంతో విశాఖ సుందరీకరణ..దేనికోసమంటే!

By:  Tupaki Desk   |   17 Jan 2020 4:59 AM GMT
మెరుపువేగంతో విశాఖ సుందరీకరణ..దేనికోసమంటే!
X
ఏపీలో మూడు రాజధానుల రగడ తగ్గముందే ప్రభుత్వం మాత్రం విశాఖపట్నం అభివృద్ధి పై శరవేగంగా పావులు కదుపుతుంది. అమరావతి తో పాటుగా - కర్నూల్ - విశాఖ ని ఏపీకి రాజధానులుగా చేయాలనీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనితో తీర ప్రాంత నగరం విశాఖపట్నం క్రమంగా రాజధాని కళను సంతరించుకుంటోంది. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న అనంతరం నగర సుందరీకరణ పనులు ఊపందుకున్నాయి.

విశాఖపట్నంలోనే గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నగర సుందరీకరణ పనులను చేపట్టారు. ప్రస్తుతం ఆయా పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు విశాఖపట్నాన్ని సమాయాత్తం చేస్తున్నారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. మధురవాడ - సాగర్ నగర్ - వుడా కాలనీ - సీతమ్మ ధార - రుషికొండ - బుచ్చిరాజు పాలెం - మద్దిళ్లపాలెం - మహారాణి పేట సహా పలు ప్రాంతాల్లో సుందీరకరణ పనులు చేపట్టారు. నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో రోడ్లకు ఇరువైపులా అందమైన బొమ్మలను చిత్రీకరించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద కేంద్రం కేటాయించిన నిధులను దీనికోసం వినియోగిస్తున్నారు. రాజధానిగా మారబోతున్న కారణంగా విశాఖపట్నంలో ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు పోలీసులు. కొత్తగా 20 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నారు.

గణతంత్ర దినోత్సవం నాటికి 20 వేల సీసీటీవీ కెమెరాలను అమర్చడాన్ని పూర్తి చేస్తామని నగర ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. రామకృష్ణా బీచ్ నుంచి భీమిలీకి వెళ్లే మార్గాన్ని మరింత సుందరంగా మార్చబోతున్నారు. ఈ బీచ్ రోడ్డు వెంట అదనపు హంగులను సమకూర్చబోతున్నారు. దీనికి అవసరమైన నిధులను ఇదివరకే మున్సిపల్ శాఖ మంజూరు చేసినట్లు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇదే మార్గంలో ట్రామ్‌ వే ట్రైన్‌ ను నడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనికోసం ఇప్పటికే జీవీెఎంసీ అధికారులు ఓ దఫా సర్వేను సైతం పూర్తి చేశారు.