దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మలుపుగా పరిగణిస్తున్న వస్తు - సేవల పన్ను (జీఎస్టీ)కి నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికేసింది. ఓ వైపు జీఎస్టీకి స్వాగతం పలుకుతూ కేంద్రం పార్లమెంటు వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుండగా... అదే సమయంలో నవ్యాంధ్ర బిజినెస్ కేపిటల్ విశాఖలో బిగ్ బజార్ బద్దలైపోయింది. వెరసి జీఎస్టీ ఫస్ట్ ఎఫెక్ట్ మనకే తగిలినట్లైంది. ఈ ఘటన వివరాల్లోకెళితే... నిన్న అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందన్న క్రమంలో కొన్ని మాల్స్... జీఎస్టీ క్లియరెన్స్ సేల్స్ పేరిట భారీ ప్రచార అర్భాటాలతో భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఇందులో భాగంగా విశాఖలోని బిగ్ బజార్ నిర్వాహకులు కూడా ఈ తరహా ప్రకటనలు గుప్పించారు.
క్లియరెన్స్ సేల్స్ అంటే... వాస్తవ ధరల కంటే కాస్తంత తక్కువగానే వస్తువులు దొరుకుతాయన్న ఉద్దేశ్యంతో విశాఖ వాసులు కూడా బిగ్ బజార్ కు క్యూ కట్టారు. దీంతో నిన్నంతా బిగ్ బజార్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం నుంచి ఆ రద్దీ మరింతగా పెరిగింది. రాత్రి పది గంటల ప్రాంతానికి ఆ రద్దీ మరింతగా పెరిగిపోగా... అప్పటికే క్లియరెన్స్ సేల్ కింద ప్రకటించిన సరుకు మొత్తం అయిపోయిందంటూ బిగ్ బజార్ నిర్వాహకులు షాపుకు షట్టర్ లు మూసేశారు. దీంతో ఆగ్రహించిన జనం... భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించి... అంతలోనే షాపును మూసేస్తారా అంటూ బిగ్ బజార్ పై విరుచుకుపడ్దారు.
కొందరు అక్కడి ఫర్నీచర్ పై ప్రతాపం చూపగా, మరికొందరు క్లియరెన్స్ సేల్స్ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఊడబెరికేశారు. వేలాది మంది జనం ఒక్కసారిగా విరుచుకుపడిన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా వారిని నిలువరించేందుకు చేసిన యత్నాలు ఏమాత్రం ఫలించకపోగా... ఖాకీలు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. వెరసి జీఎస్టీ ఎఫెక్ట్ కారణంగా తొలి ధ్వంస రచన మన దగ్గరే నమోదైపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/