Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు : పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం .. వెనక్కి తగ్గేది లేదంటున్న పల్లా !

By:  Tupaki Desk   |   16 Feb 2021 7:30 AM GMT
విశాఖ ఉక్కు : పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం .. వెనక్కి తగ్గేది లేదంటున్న పల్లా !
X
విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున ఆయన్ని బలవంతంగా దీక్షా స్థలి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. పల్లా శ్రీనివాసరావు 6 రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు వైద్య సాయం అందాలనే ఉద్దేశంతో దీక్షను భగ్నం చేశారు. అయితే , ఈ సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి.

అయినప్పటికీ పోలీసుల ప్రయత్నమే ఫలించింది. పోలీసులు తన దీక్షను భగ్నం చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వానికి ఇది నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని, దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. నిర్వాసితులకు కూడా న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. రోజురోజుకూ ఉక్కు ఉద్యమం బలపడుతోంది. స్థానిక నేతలు ఎవరికి వారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ ప్రకటనలు చేస్తున్నారు. అటు కేంద్రంలో కూడా రాష్ట్ర ఎంపీలు తమ విన్నపాలు తెలియజేస్తున్నారు. శ్రీనివాస్‌ను దీక్షా శిబిరం నుంచి బలవంతంగా కృషి ఐకాన్ హాస్పిటల్‌కు తరలించారు.

మరోవైపు టీడీపీ సైతం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 18న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలని శ్రేణులకు సూచించారు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించే వరకు టీడీపీ విశ్రమించదన్నారు.