Begin typing your search above and press return to search.

వాజ్ పేయి-విశాఖ ఉక్కు: ఒక్కసారి 1977లోకి వెళ్తే..

By:  Tupaki Desk   |   24 April 2021 12:30 PM GMT
వాజ్ పేయి-విశాఖ ఉక్కు: ఒక్కసారి 1977లోకి వెళ్తే..
X
'ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు' అనే నినాదం 1970 కంటే ముందు మారు మోగింది. మొత్తానికి అప్పటి పరిస్థితుల్లో ఆంధ్రులు ఎలాగైనా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ను దక్కించుకున్నారు. అయితే గత సంవత్సర కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కోసం నిర్ణయం తీసుకున్న తరుణంలో ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం ఒక్కసారిగా చెలరేగి ఒకేసారి చల్లారినట్లయ్యింది. అది కేంద్ర విధాన నిర్ణయమని, దానికి మనం ఏం చేయలేమని ప్రభుత్వమే మౌనంగా ఉండడంతో ఇక మిగతా వారికి కూడా పోరాటంపై ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో అటల్ బిహార్ వాజ్ పేయి వారసుడిగా చెప్పుకున్న ప్రధానమంత్రి మోడీ ఆయన తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరిస్తన్నాడని చెప్పొచ్చు.

ఒకసారి వాజ్ పేయి కాలంలో ఏం జరిగిందో చూద్దాం.. భారతదేశంలో మొట్టమొదటి సారిగా 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా అటల్ బీహార్ వాజ్ పేయి కొనసాగారు. విదేశాంగ విధానంలో నూతన ఒరవడికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, తాము నెహ్రూకు భిన్నంగా ఏ రకమైన మార్పులు తీసుకురావడం లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే భారత దేశ ఉక్కు పారిశ్రామిక రంగంలో రష్యా పాత్ర తగ్గించమని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో నెలకొల్పనున్న ఉక్కు పరిశ్రమలో మరింత కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా భిలాయ్, బికారో ఉక్కు పరిశ్రమల తరువాత భారత దేశం సోవియట్ యూనియన్ పై ఆధారపడడం తగ్గించింది. ఇందులో భాగంగా రూర్కెలా, దుర్గాపూర్ ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు జర్మనీ, బ్రిటన్ సహాయం తీసుకుంది. అయితే ఈ పరిశ్రమల ఏర్పాటులో వాజ్ పేయి సహజంగా మార్పు తీసుకొచ్చారని పలువురు భావించారు. అయితే విశాఖ ఉక్కు విషయంలో మాత్రం రష్యా మైత్రిని కొనసాగిస్తామని, ఆ దేశ విదేశాంగ మంత్రి గ్రోమికోకు పంపిన లేఖలో వాజ్ పేయి తెలిపారు. ఏదీ ఏమైనా మొత్తానికి పలువురి సహకారంతో విశాఖలో ఉక్కు పరిశ్రమ కార్యకలాపాలు మొదలయ్యాయి.

అయితే వాజ్ పేయి వారసుడిగా చెప్పుకుంటున్న మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాత్రం భిన్న వైఖని అవలంభిస్తున్నాడు. గనులు కేటాయిపులు ఉన్న ప్రైవేట్ సంస్థలు ముడి సరుకు కోసం సగటున రూ.1500 వెచ్చిస్తే, ఎలాంటి కేటాయింపులు లేని విశాఖ స్టీల్ ముడి ఖనిజం కోసం రూ.7000 వరకు ఖర్చు చేస్తోంది. మొత్తంగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం, ఆర్థిక నివేదికల ఆధారంగా పరిశీలిస్తే స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని తెలుస్తోంది. దేశంలో లక్ష్మి మిట్టల్ లాంటి భారతీయ పారశ్రామిక వేత్తలు విదేశాల్లో ఉక్కు పరిశ్రమలో రాణిస్తుండగా.. దేశంలోని ఓ ప్రభుత్వ రంగ సంస్థ దివాలా తీయడం గమనార్హం. ఇదిలా ఉండగా మోదీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎలాంటి గనులు కేటాయించకపోవడం ఆ కంపెనీ నష్టాలకు కారణమన్న విమర్శ ఉంది. అయినా ఈ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకోవడం నిర్వివాదాంశమే.