Begin typing your search above and press return to search.

ఆస్తుల జప్తుకి స్కెచ్‌...చిక్కుల్లో స‌బ్బం హ‌రి

By:  Tupaki Desk   |   10 Oct 2018 2:13 PM GMT
ఆస్తుల జప్తుకి స్కెచ్‌...చిక్కుల్లో స‌బ్బం హ‌రి
X
గ‌త కొద్దికాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ సబ్బం హరి అనూహ్య రీతిలో తెర‌ మీద‌కు. ఆయ‌న‌కు నోటీసులు రావ‌డ‌మే కాకుండా ఏకంగా ఆస్త‌ల జ‌ప్తు హెచ్చ‌రిక‌లు జారీ అవ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డ‌క్క‌న్ క్రానిక‌ల్ ఆస్తుల వేలంలో కొనుగోలు ప్ర‌క్రియ‌ - అనంత‌రం రుణం చెల్లింపు ఎపిసోడ్‌ లో అప్పు చెల్లించాలంటూ సబ్బం హరికి విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని బ్యాంక్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.`వడ్డీతో సహా మీరు చెల్లించాల్సిన రుణ మొత్తం 9.54 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని 60 రోజుల్లోగా చెల్లించాలి. లేదంటే అప్పుకోసం మీరు కుదువ పెట్టిన ఇల్లు - అపార్ట్ మెంట్ - స్థలం స్వాధీనం చేసుకుంటాం’ అని నోటీసుల్లో తేల్చిచెప్పారు.

హాట్ టాపిక్‌ గా మారిన ఈ ఆస్తుల విష‌యంలోకి వెళితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన డ‌క్క‌న్ క్రానిక‌ల్ ఆస్తుల‌ను వేలం వేసేందుకు ఆయా బ్యాంకులు కొద్దికాలం క్రింద‌ట ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే విశాఖ న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న మద్దిలపాలెంలోని డక్కన్‌ క్రానికల్‌ భవనాన్ని కోటక్‌ మహేంద్ర బ్యాంక్ 2014లో వేలం వేసింది. వేలంలో పాట్గొన్న స‌బ్బం హ‌రి 17 కోట్ల 80 లక్షల రూపాయలకు ఆ స్థ‌లాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఈ కొనుగోలు ప్ర‌క్రియ‌లో స‌బ్బం హ‌రి రుణాన్ని పొందేందుకు బ్యాంకుల‌ను ఆశ్ర‌యించారు. ఇందులో భాగంగా సీతమ్మధారలో 1622 చదరపు గజాల స్థలంలో ఉన్న తన నివాస గృహాన్ని - విశాఖ బీచ్‌ రోడ్డులో రుషికొండ సమీపంలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని- మాధవధార వుడా లే అవుట్‌ లోని 444.44 చదరపు అడుగుల స్థలంలో ఉన్న అపార్ట్‌ మెంట్ కుదువపెట్టి 8.5 కోట్ల రూపాయల రుణాన్ని విశాఖ సహకార బ్యాంకులో తీసుకున్నారు. అయితే, ఈ రుణంకు చెల్లింపు ప్ర‌క్రియ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో రుణం వడ్డీతో సహా 9.54 కోట్లకు చేరింది.

మ‌రోవైపు త‌న ఆస్తుల వేలంలో స‌రైన నిబంధ‌న‌లు పాటించలేద‌ని పేర్కొంటూ డ‌క్క‌న్ క్రానిక‌ల్ యాజ‌మాన్యం డెబిట్‌ రికవరీ అథారిటీలో కేసు వేసింది. ఈ కేసు తుది తీర్పు వెలువ‌డక‌పోవ‌డంతో డ‌క్క‌న్ క్రానిక‌ల్ భ‌వ‌నం స్వాధీనం కాలేదు. అదే స‌మ‌యంలో రుణం మొత్తం భారీగా పెరిగిపోతోంది. దీంతో విశాఖ స‌హ‌కార బ్యాంకు అధికారులు తాజాగా నోటీసులు జారీచేశారు.