Begin typing your search above and press return to search.

28న విశాఖ బంద్... ఉక్కు పోరు వేరే లెవెల్...?

By:  Tupaki Desk   |   18 March 2022 2:30 PM GMT
28న విశాఖ బంద్... ఉక్కు పోరు  వేరే లెవెల్...?
X
విశాఖ ఉక్కు ఉద్యమానికి నాలుగు వందల రోజులు గడచినా కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. అదే టైంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ దూకుడుగా తీసుకుంటోంది. ఇక ఉద్యమకారులకు కొత్త పరీక్షలు పెడుతోంది. ఇప్పటిదాకా చేసిన ఉద్యమం సెగలు పెద్దగా ఢిల్లీని తాకలేదు అనుకోవాలి. దాంతో ఉక్కు కార్మిక సంఘాలు ఈ నెల 28న విశాఖ బంద్ వంటి కఠిన నిర్ణయం తాజాగా తీసుకున్నారు.

అందుకే నింపాదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ విశాఖ ఉక్కుని ప్రైవేట్ బాట పట్టించే ప్రయత్నాలు చేసోంది. ఇందులో భాగంగా గడచిన అరవై రోజుల్లోనే ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఈ ఏడాది జనవరి 27న ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కేంద్రం వాటాతో పాటు, మిగిలిన సంస్థల అనుబంధ వాటాలను ఉపసంహరించుకునేందుకు ప్రాధమికంగా ఆమోదముద్ర వేసేసింది.

అంటే దీనితో పాటుగా ప్రభుత్వ రంగ కంపెనీలలో ప్రభుత్వ ఈక్విటీని నిర్వహించే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఈ నెల 11న ద్వాళా బోర్డ్ ఆఫ్ ఇండియా లో రిజిష్టర్ చేయబడిన అసెట్ వాల్యూయర్ ని నియమించడానికి ప్రతిపాదన కోసం అప్పీల్ చేసింది.

దీనిని బట్టి చూస్తే కంపెనీ ఆస్తుల మదింపును నిర్వహించడంతో పాటు స్టీల్ ప్లాంట్ లోని వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియో కేంద్రానికి కావాల్సిన హెల్ప్ చేయడానికే ఈ డెసిషన్ తీసుకున్నారు అని అర్ధమవుతోంది. ఓ విధంగా చెప్పాలీ అంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అన్ని బంధాలను తెంచేసుకోవడానికి అన్నట్లుగానే ఈ ప్రక్రియ సాగుతోంది అని చెప్పాలి.

ఈ నేపధ్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరింత గట్టిగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. విశాఖ ఉక్కు వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను ప్రైవేట్ పరం చేయాలనుకున్నపుడు ఒక కెరటం మాదిరిగా సునామీ మాదిరిగా ఏపీ నుంచి రాజకీయ ఉద్యమం చెలరేగుతుందని అప్పట్లో అంతా భావించారు. కానీ ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇతర కారణాల వల్ల అది మాత్రం జరగలేదు.

కేవలం ఉక్కు కార్మికులే ఉద్యమం చేసుకుంటూ వస్తున్నారు. దాంతో కేంద్రం దూకుడుని పెంచేసింది. ఈ స్థితిలో మలి విడత ఉద్యమానికి ఉక్కు కార్మికులే శ్రీకారం చుడుతున్నారు. దానికి నాందిగా ఈ నెల 28న విశాఖ బంద్ ని నిర్వహిస్తున్నారు. ఈ బంద్ ద్వారా మరోసారి విశాఖలో ఉన్న లక్షలాది ప్రజలకు విశాఖ స్టీల్ గోడు తెలియచేయడంతో పాటు అగ్గి రాజేయాలన్నదే ప్రయత్నం. ఇక కలసి వచ్చే రాజకీయ పక్షాలతో ఢిల్లీ వేదికగా పోరాడాలని చూస్తున్నారు.

దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకోనున్నారు. పార్లమెంట్ లో బీజేపీ మినహా మిగిలిన పార్టీల నుంచి వంద మందికి పైగా ఎంపీల మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు. అదే కనుక జరిగితే వేరే లెవెల్ లో ఉక్కు ఉద్యమం సాగుతుంది అని చెప్పాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటామని కూడా కార్మికులు శపధం చేస్తున్నారు.

మొత్తానికి చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం ఈసారి పనిచేస్తుందా అన్నదే ఒక ప్రశ్న. ఏది ఏమైనా కేంద్రం దూకుడుని అడ్డుకుని తీరుతామని కార్మిక నేతలు చెబుతున్నారు. మరి కలసి వచ్చే రాజకీయ పక్షాలు ఏంటో చూడాలి.