Begin typing your search above and press return to search.

వైరస్ ఎఫెక్ట్.. భర్త శవాన్ని చివరి చూపు చూడలేకపోయిన భార్య

By:  Tupaki Desk   |   30 Jun 2020 9:00 AM GMT
వైరస్ ఎఫెక్ట్.. భర్త శవాన్ని చివరి చూపు చూడలేకపోయిన భార్య
X
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ పేరు వింటేనే ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతుంది. ఇక ఇప్పుడిప్పుడే మన భారతదేశం లో వైరస్ విజృంభణ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ వైరస్ సమయంలోకొన్ని మనసు చలించి పోయే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తిని అందరూ ఉండి కూడా అనాధ శవంలా దాహనం చేశారు. చివరికి కట్టుకున్న భార్యకి , కన్న బిడ్డలకు కూడా కడసారి చూపు దక్కలేదు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు చూస్తే... ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన 47 సంవత్సరాల వ్యక్తికి జ్వరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఒంగోలులోని రిమ్స్ ‌కు తరలించారు. వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆయన శ్వాబ్‌, రక్తనమూనాలు సేకరించారు. గతం నుంచే ఆయనకు బీపీ, షుగర్‌తోపాటు గుండె సంబంధమైన సమస్య కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ భయంతో ఆందోళనకు గురైన ఆ వ్యక్తి శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.

ఆతర్వాత వచ్చిన ఫలితాల్లో అతనికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ‌లోని మార్చురీకి తరలించారు. అందరూ ఉన్నా రెండు రోజులపాటు అనాథలా అక్కడే ఉంచారు. ఇక రాత్రి ఆయన భార్య, కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో వారు అధికారులను తొలుత ప్రతిఘటించారు. తామే స్వచ్ఛందంగా ఒంగోలుకు తీసుకువస్తే సరైన వైద్యం అందించలేదని, అందుకే ఆయన మృతి చెందాడని మండిపడ్డారు. మమ్మల్ని కూడా పరీక్షల పేరుతో చంపేందుకు తీసుకువెళ్తున్నారా అంటూ నిలదీశారు. అనంతరం ప్రాథేయపడ్డారు.

భర్త మృతదేహం సోమవారం ఉదయం పామూరుకు తీసుకొస్తున్నారని కడసారి చూసుకుని వస్తానని మృతుని భార్య అధికారులను వేడుకున్నప్పటికీ అధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో మృతుడి భార్య, కుటుంబ సభ్యులు ఒంగోలులోని క్వారంటైన్‌ కు వెళ్లారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆ ఇంటి పెద్ద మృతదేహాన్ని అధికారులు అంబులెన్స్ ‌లో నేరుగా పామూరులోని ముస్లిం శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. క్రిమసంహారక ద్రావణంతో ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. ఆయన అన్నదమ్ములు, బంధువులను ఎవ్వరినీ కూడా కడసారి చూసేందుకు అనుమతి ఇవ్వలేదు.