Begin typing your search above and press return to search.
వీరూ ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆడతాడట
By: Tupaki Desk | 13 Jan 2021 3:52 AM GMTఒకప్పుడు వీరేంద్ర సెహ్వగ్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను ఎలా అలరించేవాడో తెలిసిందే. ఐతే ఆటకు టాటా చెప్పేశాక కూడా వీరూ ఎంటర్టైన్మెంట్ ఏమీ తగ్గిపోలేదు. వీరూ వ్యాఖ్యాతగా వ్యవహరించినా.. ట్విట్టర్లో పోస్టులు పెట్టినా అతడి మార్కు చమక్కులకు లోటుండదు. ప్రతి ట్వీట్‌లోనూ పంచ్ మిస్సవ్వకుండా చూసుకుంటాడతను. తాజాగా ఒక సీరియస్ ఇష్యూ మీద లైటర్ వీన్‌లో స్పందిస్తూ తన ఫాలోవర్లను ఎంటర్టైన్ చేశాడు వీరూ. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా భారత జట్టు గాయాలతో ఎలా అల్లాడుతోందో తెలిసిందే. ఇప్పటికే షమి, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయపడి సిరీస్‌కు దూరం కాగా.. మూడో టెస్టులో గాయపడ్డ జడేజా కూడా ఇంటిముఖం పట్టాడు. అలాగే బుమ్రా సైతం నాలుగో టెస్టుకు దూరమైనట్లే అంటున్నారు. ఇంకా విహారి, అశ్విన్ సైతం గాయలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి సమాచారంతో ఉన్న ఒక చిత్రాన్ని షేర్ చేసిన వీరూ.. ‘‘ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు 11 మంది సరిపోతారో లేదో, అవసరమైతే నేను మ్యాచ్ ఆడటానికి వెళ్తా. కొంచెం క్వారంటైన్ సంగతి చూసుకోండి’’ అంటూ బీసీసీఐని ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టాడు. వీరూ సరదాకే ఈ ట్వీట్ చేసినప్పటికీ.. టీమ్ ఇండియా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అతను చెప్పకనే చెప్పాడు. ఒక సిరీస్‌లో ఇంతమంది గాయపడటం ఇంతకుముందెన్నడూ జరగలేదు. చివరి టెస్టుకు తుది జట్టులో ఆడే ఫిట్నెస్ ఉన్న ఆటగాళ్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. బుమ్రా స్థానంలోకి అరంగేట్ర బౌలర్ నటరాజన్ వచ్చే అవకాశాలుండగా.. విహారి ఆడే అవకాశం లేకుంటే మూడో టెస్టుకు వేటు వేసిన మయాంక్ అగర్వాల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్‌రౌండర్ జడేజా స్థానంలో కుల్‌దీప్‌ను ఆడిస్తారేమో. కానీ భారత జట్టు మిస్ అవుతున్న ఆటగాళ్లకు వీళ్లు సరైన ప్రత్యామ్నాయాలు కారన్నది మాత్రం వాస్తవం.