Begin typing your search above and press return to search.

కరోనా వేళ తప్పులే చేశామే కానీ గుణపాఠాలు నేర్వలేదా?

By:  Tupaki Desk   |   13 Aug 2021 6:30 AM GMT
కరోనా వేళ తప్పులే చేశామే కానీ గుణపాఠాలు నేర్వలేదా?
X
అంటువ్యాధి గురించి ప్రజల్లో అంతో ఇంతో అవగాహన ఉంటుంది. కానీ.. వైరస్ అటాకింగ్ ఎలా ఉంటుందన్నది డిజిటల్ యుగంలోని వారికి కొత్తే. ప్రజలకే కాదు ప్రభుత్వాలకు కొత్తే. కానీ.. ఈ వైరస్ మీద పని చేసే వారి సంగతేంటి? కరోనా లాంటి ప్రమాదకర వైరస్ తీవ్రత ఎంత ఉంటుంది? దాని కారణంగా చోటు చేసుకునే పరిణామాలు ఏమిటన్న దానిపై పెద్ద ఎత్తున సలహాలు.. సూచనలు అందించాల్సిన వారు ఏమైపోయారు? అలాంటి వారి మాటలకు పెద్దపీట వేసి.. వారు చేసే సూచనలకు ప్రచారం ఇవ్వాల్సిన ప్రభుత్వాలు .. అధికారులు ఏం చేశారు? లాంటివి చూస్తే.. కరోనా మహమ్మారి వేళ సామాన్యులు మాత్రమే కాదు.. ప్రభుత్వాలు.. మేధో సంస్థలు కూడా తప్పులు చేశాయనిపించక మానదు.

ప్రపంచాన్ని పెను సంక్షోభంలో పడేసిన మహమ్మారి ఇప్పటికే సవాళ్లు విసురుతూనే ఉంది. కరోనా ఎపిసోడ్ ను మొదట్నించి చూస్తే.. అది మన అంచనాలకు మించినట్లుగా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. వూహాన్ మహానగరంలో శశ్మాన నిశ్శబ్దాన్ని తీసుకొచ్చిన వేళ.. ప్రపంచంలో ఒక్క ఉలికిపాటుకు గురై.. కాస్తంత దూరం ఆలోచించినా.. ఇవాల్టిరోజున ఇప్పుడున్న ఇబ్బందులు ప్రపంచానికి ఉండేవి కాదేమో?

ఎప్పటికప్పుడు పైచేయి సాధించామని సంబరపడుతూనే.. కరోనా ఇచ్చే షాకులతో దిమ్మ తిరిగిపోవటం తరచూ ప్రపంచానికి ఎదురవుతున్న అనుభవమేనని చెప్పాలి. తాజాగా సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ లోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ తాజాగా ఒక సెమినార్ ను ఆన్ లైన్ వేదికగా నిర్వహించింది. కొవిడ్ నుంచి మనం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నాం? ఏ పాఠాలు నేర్చుకోలేకపోయామన్న అంశంపై మీద సాగిన చర్చ కాస్తంత మెహమాటాలకు దూరంగానే సాగిందని చెప్పాలి.

ఈ సందర్భంగా ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ షాహిద్ జమీల్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏ వైరస్ నైనా అడ్డుకునే వ్యాక్సిన్ల తయారీకి వీలుగా శాస్త్రవేత్తలు 5 లక్షల వైరస్ లపై అధ్యయనాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కరోనా వేళ జరిగిన తప్పుల్ని ఆయన నిర్మోహమాటంగా వెల్లడించారు. తుంపర్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు మొదట్లో చెప్పారని.. అదే సమయంలో గత అనుభవాల్ని సరిగా అధ్యయనం చేయకుండానే తుంపర్లను అడ్డుకుంటే చాలు.. కరోనా ఆగిపోతుందని చెప్పారని.. ఆ తర్వాత గాలి ద్వారా కూడా మహమ్మారి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

వైరస్ స్వభావాన్నిఅర్థం చేసుకోకపోవటం వల్లే సెకండ్ వేవ్ లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన వచ్చిందన్నారు. ఇప్పుడేమో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది కాబట్టి కరోనా తీవ్రత తగ్గుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారని.. ఎంతమందికి వైరస్ వస్తే.. ఎంత హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందనే అంశంపై స్పష్టత లేదని.. సీరో సర్వేలను కూడా పూర్తిస్థాయిలో విశ్వసించలేమని చెప్పేశారు.

అంతేకాదు.. ఒకరి నుంచి ఎంతమందికి వైరస్ సోకుతుందని చెప్పే విషయంలోనూ ప్రభుత్వాలు ఇచ్చే డేటా సమగ్రంగా లేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇలాంటి అసమగ్ర సమాచారంతో.. తెలిసింది కొంత తెలియంది కొంత కలగలిపిన నిర్ణయాలతో మూడో వేవ్ కు వెల్ కం చెప్పటం మినహా మరొకటి లేదని చెప్పాలి. వ్యాక్సినేషన్ పెరుగుతున్న కొద్దీ కరోనాలో మ్యుటేషన్లు తగ్గుముఖం పడుతున్నాయన్న సానుకూలాంశం కూడా చర్చకు వచ్చింది. ఇదంతా చూసినప్పుడు కరోనా వేళలో.. ఇన్నేసి తప్పులు జరిగాయా? అన్న భావన కలుగక మానదు. ఎందుకంటే.. ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని చెప్పుకున్నా.. చేయాల్సిన దానికి చాలా తక్కువగానే చేసిందన్న మాట నిపుణుల నోటి నుంచి వచ్చే మాటలు అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేస్తాయి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.