Begin typing your search above and press return to search.

అమెరికాలోని ఆ న‌గ‌రంలో అహంకార ఎమ‌ర్జెన్సీ!

By:  Tupaki Desk   |   13 Aug 2017 8:13 AM GMT
అమెరికాలోని ఆ న‌గ‌రంలో అహంకార ఎమ‌ర్జెన్సీ!
X
శ్వేత అహంకారం అమెరికాలో క‌నిపిస్తూనే ఉంటుంది. పేరుకు అగ్ర‌రాజ్య‌మైనా.. అక్క‌డి ప్ర‌జ‌ల్లో కొంద‌రిలో ఉన్న ఇరుకు మ‌న‌స్త‌త్వం పుణ్య‌మా అని.. జాత్యాంహ‌కార జ్వాల‌లు భ‌గ్గుమంటుంటాయి. తాజాగా అమెరికాలో అలాంటి ప‌రిణామ‌మే ఒక‌టి చోటు చేసుకుంది. వ‌ర్జీనియా రాష్ట్రంలోని స్వ‌తంత్రంగా ఉండే చార్లెట్ విల్ న‌గ‌రంలో అతివాద శ్వేత‌జాతీయుల‌కు.. మిత‌వాదుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. దీంతో అక్క‌డ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించారు.

యూరోపియ‌న్ వ‌ల‌స‌వాదుల నుంచి అమెరికాను చేజిక్కించుకుందాం.. అంటూ అతివాదుల నినాదాలు చేస్తుంటే.. మ‌రోవైపు అమెరిక‌న్లు అంతా ఒక్క‌టేన‌ని మిత‌వాదులు చేస్తున్న నినాదాల‌తో చార్లెట్ విల్ న‌గ‌రం మారుమోగుతోంది. ఈ అనుకూల‌.. ప్ర‌తికూల నినాదాల‌తో ఆ న‌గ‌రం దద్ద‌రిల్లుతోంది. ఇదిలా ఉండగా..అతివాద శ్వేత‌జాతీయుల‌కు.. మిత‌వాదుల‌కు మ‌ధ్య నెల‌కొన్న ఘ‌ర్ష‌ణ‌ల‌తో ముగ్గురికి పైగా మ‌ర‌ణించ‌టం గ‌మ‌నార్హం.

ద‌క్షిణాది జాతీయ‌వాదానికి నిలువెత్తు గుర్తుగా రాబ‌ర్ట్‌.ఈ.లీ విగ్ర‌హాన్ని అభివ‌ర్ణిస్తుంటారు. దీన్ని కాన్ఫెడ‌రేట్ పాస్ట్ స్మార‌క చిహ్నంగా చెబుతుంటారు. వ‌ర్సిటీ ఆఫ్ వ‌ర్జ‌నీయా నుంచి దీన్ని తొల‌గించాలంటూ స్థానిక కౌన్సిల్ తీసుకున్న నిర్ణ‌యంతో తాజా ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌ణంగా చెబుతుంటారు.

తాము గ‌ర్వ‌కార‌ణంగా భావించే స్మార‌క చిహ్నాన్ని తొల‌గించొద్దంటూ క‌ర‌డుగ‌ట్టిన శ్వేత‌జాతీయులు కొంద‌రు ఉద్య‌మం మొద‌లు పెట్టారు. ఇది కాస్తా.. యూరోపియ‌న్.. ఆఫ్రియ‌న్ వ‌ల‌స‌దారుల‌పై విద్వేషంగా మారింది. మొద‌ట్నించి అమెరికాలో ఉంటున్న త‌మ‌పై యూరోప్ నుంచి వ‌చ్చిన వ‌ల‌స‌దారులు పెత్త‌నం చెలాయిస్తున్నార‌ని ఆందోళ‌న‌కారులు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అమెరికాను తిరిగి చేజిక్కించుకుందామంటూ నినాదాలు చేశారు. నిర‌స‌న‌కారుల‌కు నేతృత్వం వ‌హించిన వారిలో ముఖ్యుడైన డేవిడ్ డ్యూక్ అధ్య‌క్షుడు ట్రంప్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ట్రంప్ ను ఒక‌సారి అద్దంలో ఆయ‌న త‌న ముఖాన్ని చూసుకోవాల‌ని.. ఆయ‌న గెలిచింది శ్వేత‌జాతీయుల ఓట్ల‌తోనే కానీ ఆ రాడిక‌ల్ లెఫ్టిస్టుల ఓట్ల‌తో కాద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. శ్వేత‌జాతి అతివాదులకు వ్య‌తిరేకంగా శ‌నివారం మిత‌వాదులు భారీ ర్యాలీని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కారులు త‌ర‌లివ‌చ్చారు. చార్లెట్ విల్ లోని ఒక వీధిలో కిక్కిరిసి ఉన్న మిత‌వాదుల‌పై ఒక కారు వేగంగా దూసుకొచ్చి.. విచ‌క్ష‌ణార‌హితంగా తొక్కేసి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక మ‌హిళ మ‌ర‌ణించ‌గా.. మ‌రో 50 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మిత‌వాదులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ దారుణ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన ఒక అతివాద బృంద‌స‌భ్యుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చార్లెట్ విల్ లో సాగుతున్న విద్వేష ప్ర‌ద‌ర్శ‌న‌లు.. హింస త‌లెత్త‌టంతో అమెరికా అధ్య‌క్షుడు ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. ప్ర‌జ‌లు శాంతిని పాటించాల‌న్నారు. అమెరిక‌న్లు అంతా ఒక్క‌టేన‌ని.. స‌హ‌నం పాటించాల‌ని కోరారు. ఇదిలా ఉంటే.. చార్లెట్ విల్ లో జ‌రుగుతున్న ఆందోళ‌న ప్రాంతంలో ఆకాశంలో నుంచి గ‌స్తీ కాస్తున్న హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాద‌వ‌శాత్తు కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో పైలెట్ తో పాటు ఒక అధికారి దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో అమెరికాలోని చార్లెట్ విల్ న‌గ‌రంలో ఇప్పుడు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించారు.