Begin typing your search above and press return to search.

కోహ్లీ, రోహిత్ మధ్య అంతగా చెడిందా..హిట్ మ్యాన్ అందుకే ఎంపికవలేదా?

By:  Tupaki Desk   |   31 Oct 2020 11:30 PM GMT
కోహ్లీ, రోహిత్ మధ్య అంతగా చెడిందా..హిట్ మ్యాన్ అందుకే ఎంపికవలేదా?
X
విరాట్ కోహ్లీ ప్రపంచంలో నెంబర్ వన్ ఆటగాడు. భారత జట్టుకు కెప్టెన్ గా కూడా ఎన్నో విజయాలు అందిస్తున్నాడు. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచంలో వన్డేల్లో అత్యద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లలో ఒకడు. వన్డే మ్యాచ్ లలో కొద్ది కాలంగా అతడు కోహ్లీ కంటే అద్భుతంగా రాణిస్తున్నాడు. వీరిద్దరూ భారత జట్టుకి ఒకరు కెప్టెన్ కాగా మరొకరు వైస్ కెప్టెన్. వీరిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూనే జట్టును ముందుకు నడపడం, విజయాలు సాధించడం సాధ్యమవుతుంది. అయితే కొంతకాలంగా కోహ్లీకి, రోహిత్ కి మధ్య చెడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఆస్ట్రేలియా టూర్ కి మూడు ఫార్మాట్లకు ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మ పేరు లేకపోవడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. నిజంగానే వీరిద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయా అని చర్చ జరుగుతోంది. అది మనసులో పెట్టుకుని గాయం సాకుతో కోహ్లీ రోహిత్ జట్టు లోకి ఎంపిక అవకుండా అడ్డు పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జట్టు ఎంపిక కార్యక్రమం పూర్తయిన కాసేపటికే.. రోహిత్ శర్మ ట్విట్టర్లో తన అకౌంట్ కు రాసుకున్న ఇండియా క్రికెటర్ అనే పదాన్ని కూడా తొలగించడం పలు సందేహాలకు తావిచ్చింది.

కాగా కోహ్లీ, రోహిత్ మధ్య గత వరల్డ్ కప్ నుంచే విభేదాలు పొడచూపాయని అంటున్నారు. వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు సాధించి అద్భుతంగా ఆడగా.. ఆటగాళ్ళ ఎంపికలో తన సలహాలను కెప్టెన్, కోచ్ పట్టించుకోలేదని కొన్ని మ్యాచ్ లు జట్టు ఎంపికలో సమతూల్యం లేక చివర్లో ఓడిపోవాల్సి వచ్చిందని రోహిత్ అప్పట్లో ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. వరల్డ్ కప్ లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి రోహిత్ కోహ్లీ, అనుష్కను ఇన్‌స్టాలో అన్‌ఫాలో కావడం మొదలు పెట్టాడు. అప్పట్నుంచి వారిద్దరి మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది.

తాజాగా ఆస్ట్రేలియా పర్యటన కి మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడం సంచలనంగా మారింది. ఒకవైపు గాయపడ్డ మయాంక్ అగర్వాల్, నవదీప్ సైనీ వంటి వాళ్లను ఎంపిక చేసి రోహిత్ శర్మ ని పక్కన పెట్టడం ఏంటని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయం కారణంగానే రోహిత్ శర్మను ఎంపికలో పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ ఆ తర్వాత ప్రకటించింది. కాగా బీసీసీఐ వివరణ ఇచ్చిన కాసేపటికే నెట్స్ లో రోహిత్ శర్మ సిక్సులు బాదుతున్న వీడియోలను ముంబై ఇండియన్స్ జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో రోహిత్ శర్మ ను కావాలనే జట్టుకు దూరం చేశారా..అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య వివాదం మరింత ముదరకుండా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.