Begin typing your search above and press return to search.

కోహ్లీ - రోహిత్ శర్మ మధ్య విభేదాలు లేవట!

By:  Tupaki Desk   |   29 July 2019 5:22 PM GMT
కోహ్లీ - రోహిత్ శర్మ మధ్య విభేదాలు లేవట!
X
ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఓటమి తరువాత కెప్టెన్ కోహ్లీ - ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర విబేదాలున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొద్దిరోజులుగా రకరకాల ఊహాగానాలు - ప్రచారాలు మీడియా - సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నిటికీ విరాట్ కోహ్లీ ఇప్పుడు తెరదించాడు. రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోహ్లీ స్పష్టం చేశాడు.

వెస్టిండీస్ టూర్ కు బయల్దేరేముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి డియా సమావేశంలో మాట్లాడిన కోహ్లీ.. రోహిత్ శర్మ కారణంగా తన కెప్టెన్సీకి ఎసరు వస్తుందని తాను ఎప్పుడూ భావించలేదని - ఒకవేళ రోహిత్ ను చూసి అభద్రతా భావానికి లోనైతే అది తన ముఖంలో ప్రతిఫలిస్తుందని వివరించాడు. రోహిత్ శర్మ ఆటకు తాను అభిమానినని కోహ్లీ చెప్పుకొచ్చాడు. క్రికెట్ పై దృష్టిపెట్టాల్సిన సమయంలో లేని వివాదాన్ని రేకెత్తిస్తున్నారని - ఈ విషయమై మీడియా ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు.

వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత టీమిండియాలో లుకలుకలు బయటపడ్డాయంటూ మీడియాలో కథనాలు రావడం.. ముఖ్యంగా - కెప్టెన్ విరాట్ కోహ్లీతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అస్సలు పొసగడం లేదంటూ ప్రచారం జరగడంతో టీమిండియా అభిమానులు నివ్వెరపోయారు. రాయుడిని ఎంపిక చేయకపోవడం.. ధోనీని ముందు బ్యాటింగుకు పంపించకపోవడం వంటి విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలున్నాయి కథనాలొచ్చాయి. అనంతరం రోహిత్ శర్మ రీసెంటుగా కోహ్లీ - ఆయన భార్య అనుష్క శర్మ లను ఇన్‌ స్టాగ్రామ్‌ లో అన్ ఫాలో చేయడం ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చింది. అయితే.. వీటన్నిటికీ తెర దించుతూ కోహ్లీ ఇప్పుడు స్పష్టత ఇచ్చాడు. తమ మధ్య విభేదాలు లేవని చెప్పుకొచ్చాడు. తమ మధ్య విభేదాలు సృష్టించడం.. అసత్య ప్రచారాల వల్ల ఎవరికి లాభమో అర్థం కావడం లేదన్నాడు. కోచ్ రవిశాస్త్రి కూడా ఎవరి మధ్యా ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చాడు.