Begin typing your search above and press return to search.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్...కోహ్లీనే నంబర్ వన్

By:  Tupaki Desk   |   17 Sep 2020 3:30 PM GMT
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్...కోహ్లీనే నంబర్ వన్
X
సమకాలీన క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్, బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. నిలకడగా పరుగుల వరద పారిస్తూ....అనతి కాలంలోనే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన ఘనత కోహ్లీకి సొంతం. విరాట్ మైదానంలో వీర విహారం చేస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్లు....ఓ పద్ధతిగా ఎటువంటి బౌలర్ నైనా ఎదుర్కొని మైదానం నలువైపులా బౌండరీలు బాదడం విరాట్ కే చెల్లుతుంది. క్రికెట్ దేవుడు, లెజెండరీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలుకొట్టగల అవకాశాలున్న సమకాలీన క్రికెటర్లలో విరాట్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ తన హవా కొనసాగిస్తున్న కోహ్లీ తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రన్ మెషీన్ కోహ్లీ నంబర్ వన్ గా నిలిచాడు.

871 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక, టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 855 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ 3వ స్థానం , న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ 4వ స్థానం, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్లు 5వ స్థానంలో నిలిచారు. ఇక, బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక, టీమిండియా ఏస్ బౌలర్ బుమ్రా 719 పాయింట్లతో రెండవ స్థానం దక్కించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ 701 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో అఫ్ఘనిస్థాన్‌కు చెందిన మొహమ్మద్ నబీ (301) అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ 2 వ స్థానంలో నిలిచాడు. టీమిండియా ఆల్ రౌండర్ జడేజా (246) పాయింట్లతో 8 వ స్థానానికి పరిమితమయ్యాడు.