Begin typing your search above and press return to search.

కోహ్లి.. ఏమిటీ వైఫల్యాలు..? మరీ ఒక్క బంతికేనా?

By:  Tupaki Desk   |   24 April 2022 12:33 PM GMT
కోహ్లి.. ఏమిటీ వైఫల్యాలు..? మరీ ఒక్క బంతికేనా?
X
విరాట్ కోహ్లి పనైపోయిందా..? వ్యక్తిగత పట్టింపులు అతడి ఆటపై ప్రభావం చూపాయా? కొండంత లక్ష్యాన్నయినా పిండి చేసే కోహ్లి.. కనీసం క్రీజులో పది బంతులైనా ఆడలేని స్థితికి వచ్చాడా? ఒకప్పుడు మహామహా బౌలర్లను ఎదుర్కొన్న అతడు సగటు బౌలర్ కూ వికెట్ ఇచ్చేస్తున్నాడేంటి? అగ్రశ్రేణి క్రికెటర్ నుంచి సాధారణ బ్యాట్స్ మన్ స్థాయికి పడిపోయాడా? ఇవీ ప్రస్తుతం వీరాభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు. వరుసగా రెండు గోల్డెన్ డక్ లకు కోహ్లి ఔటవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఊహించని విధంగా అతడు వికెట్ ఇచ్చేస్తుండడంతో ఆశ్చర్యపోతున్నారు.

ఏడీ నాటి కోహ్లి..? కోహ్లి ఇటీవలి స్కోర్లు చూస్తే ఓ అంతర్జాతీయ క్రికెటర్ కెరీర్ ప్రారంభంలో ఎలా తడబడేవాడో అలాగే కనిపిస్తున్నాయి. 0, 0,12, 1, 48, 5, 12, 41, 23, 13,45.. ఇవీ కోహ్లి గత 11 ఇన్నింగ్స్ ల్లో స్కోర్లు. ఓ సాధారణ బ్యాట్స్ మన్ కంటే తక్కువ స్థాయి ప్రదర్శన ఇది. బహుశా కెరీర్ ప్రారంభంలోనూ కోహ్లి ఇంతగా ఇబ్బంది పడలేదు అనుకుంటా. కానీ, ఇప్పుడు మాత్రం పరుగు పరుగుకు అతడు వెదుకులాడుతున్నాడు.

ఈ నెల 19న లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లి (0) ఔటైన విధానం, సన్ రైజర్స్ హైదరాబాద్ తో శనివారం నాటి మ్యాచ్ లో పెవిలియన్ చేరిన విధానం కోహ్లి ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేస్తోంది. అతడి బాడీ లాంగ్వేజ్ కూడా మునుపటి లా లేదు. ఫిట్ నెస్ కు మారుపేరైన కోహ్లినేనా? ఇతడు అనేలా కనిపిస్తున్నాడు.

కెప్టెన్సీ లేదు.. ఆ కళా లేదు.. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో కోహ్లి అన్ని ఫార్మాట్లకు భారత కెప్టెన్ గా తప్పుకొన్నాడు. ఐపీఎల్ సారథ్యానికీ రారాం పలికాడు. దీంతో అతడు స్వేచ్ఛగా ఆడతాడని భావించారు. కానీ, శ్రీలంక తో టెస్టు సిరీస్ సహా వెస్టిండీస్ పైనా రాణించలేకపోయాడు. ఇక ఐపీఎల్ లో ఏడు మ్యాచ్ ల్లో చేసింది 119 పరుగులే. రెండు డకౌట్లు పోగా, రెండు సార్లు 12 పరుగుల వద్ద, ఒకసారి ఒక పరుగుకు, మరోసారి 5 పరుగులకు ఔటయ్యాడు. దీన్నిబట్టే కోహ్లి బ్యాట్ పరుగులు చేయడం మర్చిపోయిందన్న సంగతి చెబుతోంది. కోహ్లిలో కెప్టెన్ గా ఉన్నప్పటి కళ లేదు. ఆ దూకుడూ కాస్త తగ్గింది.

వాస్తవానికి చూస్తే భారమంతా దిగిపోయిన నేటి పరిస్థితుల్లోనే అతడు స్వేచ్ఛగా ఆడాలి. కానీ, రానురాను మరీ కిందకు కుంగిపోతున్నాడు. ఈనెల 19నాటి మ్యాచ్ లో, శనివారం మ్యాచ్ లో డకౌట్లయినప్పడు కోహ్లి స్పందించిన తీరు పూర్తి నిరాశావాదంతో ఉన్నాడని అనిపించేలా ఉంది. విభేదాల ప్రభావమేనా? ఎంతలేదని చెప్పినా.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మతో కోహ్లికి విభేదాలు ఉన్నాయనేది ఎక్కువమంది నమ్మే వాదన. ఇది నిజమని నమ్మేలా పరిస్థితులు కూడా కనిపించాయి.

మైదానంలో దిగాక ఎలాగూ కలిసి ఆడక తప్పదు కాబట్టి అలా కనిపించేవారేమో కానీ.. టీమిండియా వీరిద్దరి మధ్య రెండు శిబిరాలుగా చీలిపోయిందనేది కాదనలేని సత్యం. ఈ ప్రభావం.. కోహ్లి వ్యక్తిగత ప్రదర్శనపై పడింది. దీంతో ఒకప్పుడు అత్యుత్తమ బంతులను సైతం అవలీలగా ఎదుర్కొన్న కోహ్లి ఇప్పుడు సగటు బంతులకూ వికెట్ ఇచ్చేస్తున్నాడు.

బయో బబుల్ భారమా? సిరీస్ లు, స్కోర్ల కంటే రెండేళ్లుగా ఆటగాళ్లను మరింత భయపెడుతున్న అంశం బయో బబుల్. కొవిడ్ కారణంగా ఆటగాళ్లంతా బబుల్ ను మీరడానికి వీల్లేని పరిస్థితి. ఇది కూడా కోహ్లి పై ప్రభావం చూపినట్లు అనిపిస్తోంది. మూడు ఫార్మాట్లు ప్లస్ ఐపీఎల్ ఆడే కోహ్లి వంటి వారు బబుల్ ను భరించడం ఎంతైనా కష్టమే.

రెస్ట్ తీసుకో కోహ్లి అక్టోబరులో టి20, వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్, టెస్టు చాంపియన్ షిప్.. ఇవీ రెండేళ్లలో టీమిండియా ఎదుటనున్న లక్ష్యాలు. వీటిని సాధించాలంటే కోహ్లి సేవలు కచ్చితంగా కావాలి. అంతేకాదు..ఫామ్ లో లేకపోవచ్చు గానీ రోహిత్ కంటే జట్టులో ఉత్తమ బ్యాట్స్ మన్
కోహ్లినే. అలాంటి కోహ్లి తిరిగి గాడిన పడాలంటే మాజీ హెడ్ కోచ్, అతడి సన్నిహితుడు రవి శాస్త్రి చెప్పినట్లు విశ్రాంతి తీసుకోవడం అత్యవసరం. మాజీ సహచరుడు కెవిన్ పీటర్సన్ సూచించినట్లు ప్రశాంతంగానూ ఉండడం అవసరం.