Begin typing your search above and press return to search.

కోహ్లీకి కోపమొచ్చేసింది..

By:  Tupaki Desk   |   18 Jan 2018 10:02 AM IST
కోహ్లీకి కోపమొచ్చేసింది..
X
ఆటల్లో సత్తా గెలిచినప్పుడు కాదు - ఓడిపోయినప్పుడు తెలుస్తుందంటారు. ఇప్పడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. వరుస విజయాలతో ఇంతకాలం ప్రశంసలు అందుకున్న టీమిండియా దక్షిణాఫ్రికాలో టెస్టు సీరిస్‌ ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ తరువాత మీడియాతో మాట్లాడిన విరాట్ సహనం కోల్పోయి మీడియాపై గంతులేశాడు. మ్యాచ్ ఓటమి బాధ్యత తన ఒక్కడిదే కాదంటూ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఎంపికలో సెలెక్టర్లకు బాధ్యత ఉందని - అంతా కలిసే టీంను ఎంపిక చేశామన్నారు. బెస్ట్ టీం ఏంటో మీడియానే చెప్పాలన్నారు.

విదేశీ సిరీస్‌ కు ఎంపిక చేసిన జట్టు అత్యుత్తమైన 11 మంది జట్టు కాదా అని విలేకరులు అడగ్గా.. బెస్ట్ లెవన్ అంటే ఏంటి.. 11 మంది అత్యుత్తమ ఆటగాళ్ల పేర్లు చెప్పండి - వారితోనే ఆడుతాం అంటూ వెటకారమాడాడు కోహ్లీ. రెండో టెస్టులో ఓటమికి బ్యాట్స్‌ మెన్‌ ల వైఫల్యమే కారణమని ఆయన అన్నాడు. బౌలర్లు రాణించినా ఫలితం దక్కలేదన్నాడు.

‘దక్షిణాఫ్రికాకు గట్టిపోటీ ఇవ్వలేకపోయాం. ఎలాగైనా గెలవాలని అనుకున్నాం. అయితే వరుస వైఫల్యాలతో ఓటమి తప్పలేదు’అని మ్యాచ్ అనంతరం కోహ్లీ వెల్లడించాడు. ఫీల్డింగ్ విభాగంలోనూ భారత్ పేలవమైన ప్రదర్శన చూపించింది. బంగారంలాటి క్యాచ్‌ లు జారవిడిచారు. అన్నింటికన్నా పేలవమైన బ్యాటింగ్‌ తో పరాజయం తప్పలేదని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ తీరుతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా, ఆయన నాయకత్వ సామర్థ్యాలపైనా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. విజయాలు దక్కినప్పుడు నాయకత్వం వహించడంలో గొప్పేమీ లేదని - పరాజయాలు ఎదురైనప్పుడు ఓర్పుతో ఆ పరిస్థితులను దాటడమే నాయకుడి లక్షణమని... తాజాగా విరాట్ కోహ్లీ ప్రవర్తన వల్ల అలాంటి లక్షణాలు ఆయనలో లేవన్న విషయం స్పష్టమైందని క్రికెట్ అభిమానుల నుంచి వినిపిస్తోంది.