Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో.. ఆ పెళ్లికి అనుకోని అతిథి.. ఇంతకీ ఏం చేసిందంటే..!

By:  Tupaki Desk   |   29 Oct 2021 3:30 AM GMT
వైరల్ వీడియో.. ఆ పెళ్లికి అనుకోని అతిథి.. ఇంతకీ ఏం చేసిందంటే..!
X
అదీ ఓ వివాహ వేడుక. పట్టువస్త్రాల్లో వధూవరులు, బంధుమిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో కళకళలాడుతున్న పెళ్లి మండపం. వధూవరులు ఒక్కటయ్యే ఆ వేళను అందరూ ముచ్చటగా చూస్తున్నారు. వైభవంగా జరుగుతున్న ఆ పరిణయం కోసం పెళ్లివారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంతో ఘనంగా తమ పిల్లల పెళ్లి జరిపించడం కోసం అన్నీ అరేంజ్ చేశారు. వచ్చిన అతిథులకు మర్యాదలు బేషుగ్గా జరుగుతున్నాయి. రకరకాల వంటలు తయారు చేేయించారు. పెళ్లింట వంటల ఘుమఘుమలు పందిరి దాకా వస్తున్నాయి. ఇక పెళ్లి తంతు పూర్తికాగానే విందుకు బయల్దేరారు అతిథులు. హాలులో భోజనాల దగ్గరకు వస్తుండగా ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఆ వివాహ వేడుకకు అనుకోని అతిథి ఒకరు వచ్చారు.

మెక్సికోలోని వన్యప్రాణాలు సంచరించే ప్రాంతమైన న్యూవోలియోనో. సరిగ్గా అదే ప్రాంతంలో ఓ వివాహం వైభవంగా జరుగుతోంది. ఈ పెళ్లికే బుజ్జి ఎలుగుబంటి అతిథిగా వచ్చిందన్నమాట. అతిథులందరూ భోజనం కోసం హాలు దగ్గరి వచ్చారు. సరిగ్గా ఇదే సమయానికి వచ్చింది ఓ ఎలుగుబంటి పిల్ల. అక్కడ ఉన్న వారు కొందరు భయంతో పరుగులు తీయగా... మరికొందరు దానిని ఆసక్తిగా చూస్తున్నారు. కొందరు పిల్లలైతే ఆ ఎలుగుబంటిని చూసి తెగ మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా ఆ ఎలుగుబంటి మాత్రం అందరినీ ఎగాదిగా చూస్తూ వీరంగం చేసింది. హాలులో భోజనాల కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లను కిందపడేసింది. టేబుళ్లపై ఉన్న ఆహారపదార్థాలను వాసన చూస్తూ కింద పడేస్తూ పోతోంది. అలా హాలులో ఆ ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఏదో పని మీద వచ్చినట్లు... దానికి కావాల్సిన పదార్థం కోసం వెతుకుతున్నట్లు భోజన హాలులో చాలా సేపు శోధించింది.

ఎలుగుబంటి ఇలా చేస్తుండగా అక్కడ ఉన్న వాతావరణం మరికొంత సందడిగా మారింది. అతిథుల్లో కొందరు తమకు ఏం పట్టనట్లుగా ఉన్నారు. మరికొందరు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. అయితే ఇదంతా జరుగుతున్న వేళ వధూవరులిద్దరూ మురిసిపోవడం గమనార్హం. ఎందుకంటే ఇలాంటి వేడుకల్లో జరిగే అరుదైన సంఘటనలు జీవితకాలం గుర్తుంటాయి కదా. నిజానికే ఈ ఇన్సిడెంట్ వాళ్లకు చాలా స్పెషలే మరి. పెళ్లి గుర్తుకువచ్చినప్పుడల్లా దీనిని తలుచుకొని మరీ నవ్వుకోవచ్చు. అయితే ఎలుగుబంటి చేసిన వీరంగంలో ఎవరినీ గాయపర్చలేదు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. బుజ్జి ఎలుగుబంటి రాక వారికి ఒక తీపి గుర్తుగానే ఉండిపోయింది.

ఈ స్పెషల్ గెస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఎలుగుబంటి చేసిన సందడి వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. పెళ్లికి చేసిన వంటల ఘుమఘుమల వల్లే ఎలుగుబంటి వివాహ వేడుకకు అనుకోని అతిథిగా హాజరైందని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. అక్కడ ఉన్న వారు ఒక్కొక్కరూ ఒక్కలా స్పందించడం నవ్వులు తెప్పించేలా ఉంది. నిజానికి వాళ్ల పెళ్లి ఇంతలా వైరల్ అవుతుందని ఆ వధూవరులు కూడా భావించి ఉండరు. మొత్తానికి ఎలుగుబంటి స్పెషల్ గా వచ్చి వారి వివాహ వేడుకను చాలా స్పెషల్ గా మార్చింది. అయితే ఇదంతా అడవి జంతువులు సంచరించే ప్రాంతం కాబట్టి సాధ్యమైంది. పైగా అక్కడి వారికి జంతువులు అంటే కాస్త భయం కూడా తక్కువగానే ఉంటుంది. వన్యప్రాణులతో సహజీవనం చేస్తున్నట్లే ఉంటారు. అందుకే ఎలుగుబంటి కూడా ఎవరినీ గాయపరచకపోవడం విశేషం. పెళ్లికి వచ్చిన ఎలుగుబంటి వీడియోను మీరూ ఓసారి చూసేయండి మరి...!