Begin typing your search above and press return to search.

శశికళ జైల్లోనే ఉన్నారా...?

By:  Tupaki Desk   |   18 July 2017 10:06 AM GMT
శశికళ జైల్లోనే ఉన్నారా...?
X
బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని... శశికళ వద్ద అధికారులు రూ.2 కోట్లు లంచం తీసుకుని సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని డీజీపీ రూప నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు... ఆ నివేదిక ఇచ్చినందుకు గాను కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు నోటీసులు ఇవ్వడమూ తెలిసిందే. అయితే... డీజీజీ రూప నివేదిక అక్షర సత్యం అనడానికి ఆధారాలుగా కొన్ని ఫొటోలు ఇప్పుడు బయటకొచ్చాయి. దీంతో కన్నడ ప్రభుత్వం విమర్శల వర్షం కురుస్తోంది.

పరప్పన అగ్రహార జైలులు శశికళకు ఏకంగా ఆరు గదులు కేటాయించడం... కిటీకీలు - తలుపులకు కర్టెన్లు వేసి జైలు వాతావరణమే మార్చేసినట్లు ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. అంతేకాదు.. శశికళ శిక్ష అనుభవిస్తున్న లాకప్ లో జయలలితకు చెందిన ఆకుపచ్చ చీరలు కూడా కనిపిస్తున్నాయి. శశికళ కోసం వంట చెయ్యడానికి ప్రత్యేకమైన పాత్రలు, పరుపు, శశికళకు అవసరమైన అన్ని వస్తువులూ అమర్చినట్లు ఆ ఫొటోలను చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. దీంతో శశికళకు జైలు శిక్ష వేశారా లేదంటే ఆమెను జైల్లో రాజభోగాలు కల్పిస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శశికళను కలవడానికి వచ్చేవారి కోసం కూడా అక్కడ ఏర్పాట్లున్నాయి. మొత్తానికి జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారనడానికి ఈ ఫొటోలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. దీంతో కర్ణాటకలోని విపక్ష నేతలు అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వాస్తవ నివేదిక ఇచ్చిన డీజీపీకి నోటీసులు ఇచ్చారని... మరి ఇప్పుడేం జవాబు చెప్తారని అక్కడి బీజేపీ నేతలు మండిపడుతున్నారు.