Begin typing your search above and press return to search.

ఏం పంచ్ మోడీజీ!

By:  Tupaki Desk   |   9 May 2015 10:55 AM GMT
ఏం పంచ్ మోడీజీ!
X
నక్సల్స్ కంచుకోట అయిన ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ ప్రాంతంలో తొలిసారి పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు మాటల మాంత్రికుడని నిరూపించుకున్నారు. దిల్మిలి గ్రామంలో అల్ట్రా మెగా ఉక్కు కర్మాగారానికి, రావ్ ఘాట్ -జగదల్ పూర్ రైల్వేలైన్ రెండోదశకు మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం పేద పిల్లలకు విద్యావకాశాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ సిటీని సందర్శించారు. మోడీ రావడానికి ముందు రోజు రాత్రి మావోయిస్టులు వందలాది మంది గిరిజనులను అపహరించారు. ఈ నేపథ్యంలో దంతెవాడలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ మావోయిస్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలోని దేశాలన్నీ భారత్ ను గుర్తిస్తున్నాయన్నారు. సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రజల ఆకాంక్షలను పూర్తి చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందుకోసం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. మావోయిస్టుల కార్యకలాపాలు ఎన్ని జరిగినా నిరాశ చెందాల్సిన అవసరం లేదని స్థానికులకు స్థైర్యాన్ని ఇచ్చారు. అశాంతికి ఎప్పటికీ భవిష్యత్ లేదని, శాంతి వల్లే మేలు జరుగుతుందన్నారు. ఏదో ఒకరోజు మావోయిస్టులు కూడా మనుషులుగా మారతారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలపడానికి అభివృద్ధి ఒక్కటే మార్గమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు.

ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా ఉంటే అది భారతదేశమే అని అన్నారు. భుజంపై తుపాకి సమస్యలను పరిష్కరించదని, భుజంపై నాగలితోనే పరిష్కారం లభిస్తుందన్నారు. నక్సలిజం పుట్టిన గడ్డపై ఒకప్పుడు రక్తపుటేరులు పారాయని, కానీ ఇపుడా గడ్డపై ప్రశాంతత నెలకొందన్నారు. నక్సలైట్ల నరమేధానికి త్వరలోనే ముగింపు పలుకుతామన్న నమ్మకం తనకుందని మోడీ పేర్కొన్నారు. ఈ గడ్డపై తప్పుడు మార్గంలో నడుస్తున్న నక్సలైట్లలో కూడా ఏదో ఒకరోజు మానవత్వం మేల్కొంటుందని చెప్పారు. హింసకు ఎలాంటి భవిష్యత్తు లేదని, శాంతి మార్గమే భవిష్యత్తుకు మూలమన్నారు. పేదలు, రైతులకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని తెలిపారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వల్ల విద్యార్థులకు మేలు జరిగిందని, తుపాకులకు బదులు విద్యార్థులకు కంప్యూటర్లు, పెన్నుల గురించి తెలిసిందన్నారు.

తన పర్యటన సందర్భంగా బంద్్ కు పిలుపు ఇచ్చి, గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులకు మోడీ ఈ రకంగా బలే పంచ్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మావోయిస్టులు మనుషులుగా మారుతారనే వ్యాఖ్యల ద్వారా వారు ఇప్పుడు మనుషులుగా లేరనే సందేశాన్ని విజయవంతంగా పంపించారు.