Begin typing your search above and press return to search.

బాలికపై సామూహిక హత్యాచారం.. నిరసనలతో అట్టుడికిపోతోంది

By:  Tupaki Desk   |   20 July 2020 3:45 AM GMT
బాలికపై సామూహిక హత్యాచారం.. నిరసనలతో అట్టుడికిపోతోంది
X
పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకున్న ఒక సామూహిక హత్యాచారం.. ఇప్పుడు పెను సంచలనంగా మారటమే కాదు.. తీవ్ర నిరసనలకు కారణంగా మారింది. విన్నంతనే రగిలిపోయేలా చేస్తున్న ఈ ఉదంతంపై స్థానికుల్లో పెల్లుబుకిన ఆగ్రహం.. ఇప్పుడు హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పెద్ద ఎత్తున వాహనాల్ని తగలబెట్టేస్తునన వైనం దీదీ సర్కారును ఆందోళనకు గురి చేస్తోంది.

పశ్చిమబెంగాల్ లోని ఉత్తర దినాజ్ పుర్ లోని కలగచ్ ప్రాంతానికి చెందిన ఒక బాలికపై సామూహిక అత్యాచారం.. అనంతరం హత్య జరిగింది. ఈ ఉదంతం బయటకు వచ్చినంతనే స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఉదంతంపై నిరసనలు పెల్లుబుకాయి. వీటిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఓవైపు ఒళ్లు మండిపోయి రోడ్ల మీదకు ఎక్కిన నిరసనకారులు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

బాలికకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డెక్కిన ఆందోళనకారులతో భారీ సంఖ్యలో వాహనాలు రోడ్ల మీద నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని నియంత్రించే క్రమంలో తీసుకున్న చర్యలు ఊహించనిరీతిలో పరిణామాలు చోటు చేసుకునేలా చేశాయి. బాలికకు జరిగిన అన్యాయంపై చర్యలు కోరుతున్న తమను నియంత్రిస్తున్న పోలీసులు.. నిందితుల్నిపట్టుకునే విషయంలో ఇలా ఎందుకు వ్యవహరించరన్న కోపానికి గురయ్యారు.

ఆందోళకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ప్రయోగించటంతో ఒళ్లు మండిన నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారం ఆందోళకారులకు పోలీసులకు మధ్య ఘర్షణగా మారింది. దీంతో.. రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వటమే కాదు..కనిపించిన వాహనాన్ని కనిపించినట్లుగా తగలబెట్టేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భాష్పవాయువును ప్రయోగించారు. దీంతో.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి సున్నితమైన సమయాల్లో పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తే.. సీన్ ఇంత రచ్చగా మారేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.