Begin typing your search above and press return to search.

ప్రపంచానికి కనిపించని గుజరాత్ గుట్టు

By:  Tupaki Desk   |   10 Oct 2018 8:21 AM GMT
ప్రపంచానికి కనిపించని గుజరాత్ గుట్టు
X
గుజరాత్ లో మరోసారి జాతి విద్వేషాలు పెచ్చరిల్లాయి. వలస కార్మికులపై జరిగిన దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ తరహా దాడులు దేశంలో జరగడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఈ తరహా దాడులు వివిధ రాష్ట్రాల్లో జరిగాయి. విద్య - ఉద్యోగావకాశాల్లో స్థానికేతరులు తమ అవకాశాలను సొంతం చేసుకుంటున్నారన్న భావన ఈ తరహా దాడులకు మూలకారణంగా కనిపిస్తోంది. అయితే గుజరాత్ లో మాత్రం దీని వెనుక వేరే బలమైన కారణాలున్నాయి.

కర్ణాటకలో 2012 ఆగస్టులో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు టార్గెట్ గా దాడులు జరిగాయి. సుమారు 30వేల మంది కర్ణాటక వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2012లో మహారాష్ట్రలో శివసేన - మహారాష్ట్ర నవనిర్మాణ సేన మద్దతుదారులు స్థానికేతరులపై ఈ తరహా దాడులను చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా 2016లో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థినుల్లో సుమారు 81శాతం మంది ఈ విధమైన వేధింపులకు గురయ్యారు.

తాజాగా గుజరాత్ లో జరుగుతున్న ఈ దాడుల్లో రాజకీయ కోణం కూడా ఉందని కథనాలు వెలువడుతున్నాయి. దాడులపై కాంగ్రెస్ - బీజేపీలు పరస్పరం విమర్శలకు పాల్పడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ జాతీయస్థాయిలో రామమందిరం - హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్లాలని భావిస్తోంది. వాటిపై విమర్శలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. దీంతో ప్రాంతీయ అంశాలను ప్రధానంగా చేసుకొని బీజేపీపై పోరాటం చేసే వ్యూహంతోనే ఈ తరహా అల్లర్లకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీపై స్థానికత అంశాన్ని ప్రధానంగా చేసుకొని పోరాటం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందట.. ఇలాంటి సందర్భాన్ని బేస్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఈ తరహా దాడులను కాంగ్రెస్ వాడుకుంటోందని బీజేపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి.