Begin typing your search above and press return to search.

వినాయక తత్వం ..వ్యక్తిత్వం

By:  Tupaki Desk   |   17 Sep 2015 5:09 AM GMT
వినాయక తత్వం ..వ్యక్తిత్వం
X
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయేత్‌

విఘ్ననాయకుడు వినాయకుడు. మనం ఏ పని ప్రారంభిస్తున్నా.. ఏ పూజ ప్రారంభిస్తున్నా.. ముందు వినాయక ప్రార్ధనతో, ఈ శ్లోకంతోనే ఆరంభిస్తాం. వినాయకుడిని స్తుతిస్తాం. స్మరించుకుంటాం. చిన్నపిల్లలకు కూడా తొలుత ఈ శ్లోకాన్నే నేర్పుతాం. కానీ వినాయకుడిని స్మరించుకోవడంలో ఇది కేవలం ఆయన రూపలావణ్య విశేషాలను వివరించేది మాత్రమే కాదు.. లోతుగా తరచి చూస్తే... మనందరం అలవాటు చేసుకోవాల్సిన వ్యక్తిత్వ విశేషాలు ఇందులో ఉన్నాయి. ప్రతి మనిషికీ ప్రాథమికంగా ఉండాల్సిన లక్షణాలు అవి.

శుక్లాంబర ధరం : తెల్లని వస్త్రాలు ధరించడం. తెలుపు రంగు స్వచ్ఛతకు ప్రతీక. అంటే తెలుపు రంగు దుస్తులు వేసుకోవడం కాదు. స్వచ్ఛత అనేది మన ఆహార్యం కావాలి. మనం నిత్యం ఆంతరంగికంగా, బాహ్యంగా స్వచ్ఛతను కలిగి ఉండాలి.

విష్ణుం : సర్వంతర్యామియైన తత్వం. ఎల్లెడలా, ఎల్లరియెడలా సమభావనను కలిగి ఉండడం. గీతలో పరమాత్ముడు చెప్పిన 'సర్వత్ర సమబుధ్దయః' వంటి సర్వవ్యాపితమైన సమభావన ఇది.

శశివర్ణం : చంద్రుని రంగులా తెల్లగా ఉండడం కాదు దీని అర్థం. చంద్రునిలా నిర్మలత్వం అనేదే అసలు అంతరార్థం. ఈర్ష్యాసూయలు, ద్వేషభావాలు, అత్యాశ లాంటివేమీ లేని నిర్మలమైన, నిష్కళంకమైన మనస్సు మనందరిలోనూ ఉండాలి.

చతుర్భుజం : ఇది కార్యకుశలతకు అవసరమైన లక్షణం. నాలుగు చేతులను కలిగి ఉండడం కాదు. నాలుగు చేతులు చేయగలిగినంత కార్యశీలతతో ఉండడం. పనిచేయడానికి సిద్ధంగా ఉండడం.

ప్రసన్న వదనం : ఫేస్‌ ఈజ్‌ ది ఇండెక్స్‌ ఆఫ్‌ మైండ్‌ అంటారు. మన వదనం (మొహం) ప్రసన్నంగా ఉండడం అంటే.. మన మెదడు ప్రశాంతంగా ఉండడం. మన ఆలోచన ప్రశాంతంగా ఉండడం. మనలో సహనం ఉండడం. మానవ సంబంధాలలో సహనశీలత చాలా ప్రధానం.

ధ్యాయేత్‌ : స్మరించుకోవడం. ఈ లక్షణాలను సదా గుర్తుంచుకోవడం.

సర్వవిఘ్నోపశాంతయేత్‌ : అన్ని రకాల విఘ్నాలను ఉపశమింపజేస్తుంది. ఆటంకాలను తొలగిస్తుంది.
వినాయక ప్రార్థనలోని అంతరార్థమైన వినాయక తత్వం మన వ్యక్తిత్వానికి అవసరమైన కొన్ని ప్రాథమిక లక్షణాలను తెలియజెబుతుంది. స్వచ్ఛత, సమభావన, నైర్మల్యం, కార్యశీలత, సహనశీలత, ప్రశాంతత... వీటిని ప్రాథమిక లక్షణాలుగా నిత్యం కలిగి ఉంటే.. మనకు కార్యజయం సిద్ధించినట్లే. ఈ లక్షణాలే మనకు నిత్య వ్యవహారంలో ఎదురయ్యే సకల విఘ్నాలను అధిగమించి ముందుకు దూసుకువెళ్లగల శక్తి యుక్తులను ప్రసాదిస్తాయి.

ఆదిపూజలందుకునే దేవదేవుని కరుణను సిద్ధింపజేస్తాయి. శుభం.

వినాయకచవితి శుభాకాంక్షలు.