విగ్రహ రాజకీయం మొదలైంది. గణేష్ పండుగొచ్చింది కదా.. ఇక నేతల జేబులకు చిల్లులు పడుతున్నాయట.. వినాయక చవితి నవరాత్రోత్సవాల సందర్భంగా రాజకీయ నేతలు ఇప్పుడు రెండు సమస్యలను ఎదుర్కొంటున్నారు...
మున్సిపల్ ఎన్నికలు త్వరలో వస్తున్నాయి. వార్డుల్లో పోటీచేయాలనుకుంటున్న రాజకీయ నేతలు ఇప్పుడు కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. వార్డుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది మంది విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. వారికి వినాయక చందా ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయరు. చందా ఇస్తే చేతి చమరు వదులుతుంది. ఇలా నేతలు ఇప్పుడు మౌనంగా చందాలు ఇస్తూ వామ్మో వాయ్యో అంటున్నారట..
ఇక ఆ వార్డులో చిన్న చిన్న విగ్రహాలు పెట్టేవారు సైతం పోటీచేసే కార్పొరేటర్/కౌన్సిలర్ వద్దకు వస్తూ మా ఓట్లన్నీ మీకే అంటూ ఆశలు కల్పించి మరీ వేలకు వేల చందాలు రాయించుకొని తీసుకెళ్లిపోతున్నారట...
నల్గొండ జిల్లాలో ఓ ఆశావాహ కార్పొరేటర్ ఏకంగా 2 లక్షలను విగ్రహాలకు చందాలకు రాసిచ్చాడట.. ఇక కరీంనగర్ లో 1.50 లక్షల రూపాయల చందాలు ఓ టీఆర్ ఎస్ కార్పొరేటర్ సమకూర్చాడట.. ఇలా ఎన్నికలకు ముందే వార్డుల్లోని ప్రజలను సంతృప్తి పరచడానికి నేతలు తమ ఇల్లు గుళ్ల చేసుకుంటుండడం గమనార్హం.