Begin typing your search above and press return to search.

విమలక్కకు ఏపీలో కుంభకోణం కనిపించింది

By:  Tupaki Desk   |   30 Dec 2015 6:55 AM GMT
విమలక్కకు ఏపీలో కుంభకోణం కనిపించింది
X
తప్పు ఎక్కడ జరిగినా ఎత్తి చూపించటం తప్పేం కాదు. కానీ.. అలాంటి భావాలున్న వ్యక్తి ప్రాంతీయ బంధనాల్లో ఇరుక్కుపోకూడదు. ఒక ప్రాంత ప్రయోజనాల గురించే మాట్లాడకూడదు. విశ్వ మానవుల ఈతి బాధల గురించి మాట్లాడే సహృదయం ఉన్నప్పుడు.. ప్రతి విషయంలోనూ ఇరు పక్షాల తప్పొప్పుల గురించి మాట్లాడాలి. వాటి గురించి ధైర్యం అభిప్రాయాలు వెల్లడించాలి.

అందుకు భిన్నంగా..కొందరు మేధావులు ప్రవర్తిస్తుంటారు. ప్రజాహితం కోసం పోరాడతామని చెప్పే అరుణోదయా సాంస్కృతి సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క వ్యవహారమే తీసుకుందాం. తెలంగాణ గురించి గళం విప్పిన ఆమె.. భారీ ఎత్తున పోరాడారు. దాన్ని తప్పు పట్టలేం. నిజానికి అదేమీ తప్పు కాదు. కానీ.. విభజన సమయంలో ప్రజా ఉద్యమవేత్త హోదాలో ఇరు ప్రాంతాల్లోని తెలుగువారి కష్టసుఖాల గురించి మాట్లాడాలి కదా. అలాంటిదేమీ లేకుండా కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కావటం ఏమిటి?

ఒకవేళ అలా పరిమితమే అయితే.. దాని కొనసాగించాలి కానీ.. తాను పెద్దగా పట్టించుకోని ఏపీలో ఏదో జరిగిపోతుందని ఆవేదన చెందటం ఏమిటి? తాజాగా ఆమె ఏపీలో అతి పెద్ద కుంభకోణం జరుగుతుందని వాపోతున్నారు. ఏపీ రాజధాని పేరుతో జరుగుతున్న వ్యవహారం దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఆమె అభివర్ణిస్తున్నారు. బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టటం కోసం మూడు పంటలు పండే పొలాల్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

ఒకవేళ ఆమె ఆవేదనే నిజం అని అనుకుందాం. అంతటి ఆవేదనే ఉంటే.. విభజన సమయంలో రాజధాని లేకుండా ఏపీ ప్రజలు ఆనాధల్ని చేయటం ఏమిటని ఎందుకు గళం విప్పలేదు? లేదంటే.. ఏపీకి ఒక రాజధాని తయారయ్యే బాధ్యత ఉమ్మడిగా తీసుకొని.. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు బతకాలని ఎందుకు గళం విప్పలేదు. ఏపీ ప్రయోజనాలే ఏ సందర్భంలోని పట్టనట్లుగా వ్యవహరించిన విమలక్క లాంటి వారు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఏపీకి ఏదో నష్టం జరుగుతుందని గుండెలు బాదుకోవటం ఏమిటో?