Begin typing your search above and press return to search.

ఊరంతా పగలు-రాత్రి కాపలా..ఎందుకు?

By:  Tupaki Desk   |   4 Nov 2018 3:30 PM GMT
ఊరంతా పగలు-రాత్రి కాపలా..ఎందుకు?
X
నీటి కోసం యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. ఆ ప్రధాన వనరే లేకపోతే జీవనం కష్టమే. ప్రతి పని ప్రకృతి ప్రసాదంపైనే ఆధారపడి ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన నీటి కోసం మరలా యుద్ధాలు జరిగే పరిస్థితులు కొన్నిచోట్ల పునరావృతమవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అదే జరుగుతోంది తల్వాడా గ్రామంలో.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని తల్వాడా ప్రాంతంలో నీటి కష్టాలు ఎక్కువే. ఉన్న ఒక్క చెరువులో కొద్ది పాటి నీరు ఉంది. ఆ నీటిని తస్కరించేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అర్థరాత్రి ప్రయత్నిస్తున్నారట. దీనిని అడ్డుకునేందుకు గ్రామస్థులు విడతల వారీగా చెరువు వద్ద కాపలా ఉంటున్నారు. పగలు - రాత్రి అక్కడే వేచి ఉంటున్నారు.

ఉన్న కొద్ది పాటి నీటిని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు దొంగిలిస్తే తమ గ్రామానికి నీటి ఎద్దడి తలెత్తుతుందని తల్వాడ గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఊళ్లో మొత్తం 4500 మంది నివసిస్తున్నారు. ఇక్కడి చెరువులోని నీరు త్వరగా తరిగిపోతుందనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో తమ నీటిని తామే కాపాడుకుంటామని - ఎవరూ ఇటు వైపునకు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఈ గ్రామస్థుల ఆందోళనకు కారణం లేకపోలేదు. గత వర్షాకాలంతో పొలిస్తే ఈ సారి 50 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. దీనికి తోడు నీరు తస్కరణకు గురవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తుతుందని ఆ గ్రామ సర్పంచ్ బాహూ సాహెబ్ మగర్ తెలిపారు. మనుషులతో పాటు, పశువులకు కూడా తాగేందుకు నీరు ఉండని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. గత కొద్ది రోజులుగా తామే చెరువుకు కాపలా ఉంటున్నామని, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.