Begin typing your search above and press return to search.

హిల్లరీ విజయం కోసం ఇండియాలో పూజలు

By:  Tupaki Desk   |   31 July 2016 7:05 AM GMT
హిల్లరీ విజయం కోసం ఇండియాలో పూజలు
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల కాక ప్రపంచాన్ని తాకుతోంది. అన్ని దేశాల నేతలు, పౌరులు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏం జరగబోతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామ ప్రజలైతే అమెరికా ఎన్నికల్లో తమ ప్రియతమ నేత గెలవాలని పూజలు కూడా చేస్తున్నారు. డెమొక్రాట్ల అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ విజయం కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో జిల్లా జాబ్రోలీ గ్రామ ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఏ సంబంధం లేని అమెరికా ఎన్నికల కోసం వారు ఎందుకు ఇంతలా పూజలు చేస్తున్నారు.. ప్రత్యేకంగా హిల్లరీ కోసం వారెందుకు అంతగా తపిస్తున్నారంటే దానికి కారణం ఉంది.

హిల్లరీ భర్త బిల్ క్లింటన్ 2014లో జాబ్రౌలీ గ్రామాన్ని సంద‌ర్శించారు. స్కూలు విద్యార్థుల‌తోనూ - మ‌హిళా స్వ‌యం ఉపాధి సంఘాల వారితోనూ కొన్ని గంట‌లు ముచ్చ‌టించారు. ఆయన ఇక్క‌డొక ఆరోగ్య ప‌థ‌కాన్ని ప్రారంభించారు. క్లింట‌న్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ కొన్ని కార్యక్రమాలూ చేపట్టారు. ఇప్పుడు హిల్ల‌రీ క్లింట‌న్ అధ్య‌క్షురాలు అయితే త‌మ గ్రామానికి మంచి రోజులు వ‌స్తాయ‌ని, ప్ర‌పంచ‌స్థాయి వ‌స‌తులు స‌మ‌కూరుతాయ‌ని ఈ గ్రామ‌స్థులు సంబ‌ర‌ప‌డుతున్నారు. దాంతో హిల్ల‌రీ విజ‌యం కోసం ప్రార్థ‌న‌లు చేస్తూ, ఒక‌రికొక‌రు ల‌డ్డూలు పంచుకుంటున్నారు.

చేతిలో హిల్ల‌రీ ఫొటోని ప‌ట్టుకుని ఆమె విజ‌యాన్ని కోరుకుంటూ జ‌నం పెద్ద సంఖ్యలో గ్రామంలో ప్రదర్శనలు జరుపుతున్నారు. 2014లో క్లింట‌న్ త‌న ఆరోగ్య‌ప‌థ‌కం కోసం ఈ గ్రామాన్ని ఎంచుకున్న‌పుడు ప్ర‌పంచ వాప్తంగా ఇది వార్త‌ల్లోకి ఎక్కింది. హిల్ల‌రీ, అమెరికా అధ్య‌క్షురాలు అయితే త‌ప్ప‌కుండా త‌మ గ్రామానికి వ‌స్తార‌ని ఆ గ్రామ‌స్తులు ఆశిస్తున్నారు. మరి మనవాళ్ల పూజలు ఫలిస్తాయో లేదో చూడాలి.