తప్పును సరి చేసుకునేందుకు మరో తప్పు చేయటం కొందరికి అలవాటు. ఇదే రీతిలో అబద్ధాన్ని మరో అబద్ధంతో కవర్ చేయాలని ప్రయత్నించి అడ్డంగా బుక్ అయిపోతుంటారు మరికొందరు. తాజాగా అలాంటి పనే చేసి అడ్డంగా బుక్ అయ్యాడు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పాటు.. దూరమైన కుటుంబానికి దగ్గరయ్యేందుకు అతగాడు ప్రదర్శించిన చావుతెలివితేటల్ని పోలీసులు తేల్చేయటమే కాదు.. మరో కొత్త కేసు అతడి మెడకు చుట్టుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
కొన్ని సినిమాలు నిర్మించి ఆర్థిక కష్టాల్ని కొని తెచ్చుకున్న విక్రమ్ గౌడ్.. సినిమాటిక్ ఆలోచనలతో వేసిన ప్లాన్ అడ్డం తిరిగి.. అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది. తనకున్న సమస్యల పరిష్కారానికి తనపై కాల్పులు జరిగేలా చేసుకొని.. ఆ టైంలో వచ్చిన సానుభూతితోఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతకాలం బయటపడటం.. దూరమైన కుటుంబానికి దగ్గరయ్యేందుకు వేసిన ప్లాన్ ఇప్పుడు బయటకు వచ్చేసింది.
తనపై ఎవరైనా తుపాకీతో కాల్పులు జరిపితే.. ఆ హత్యాయత్నం ద్వారా ఫ్యామిలీకి దగ్గర కావాలన్నది విక్రమ్ గౌడ్ ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకోసం కొద్ది నెలలుగా ప్రయత్నిస్తున్న అతడు.. తాను అనుకున్న పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసేందుకు వీలుగా నందు అనే వ్యక్తికి అప్పగించాడు. ముందుగా స్థానికంగా ఉన్న షూటర్లను సంప్రదించిన అతగాడు.. వారు తాను అనుకున్నట్లుగా ప్రొఫెషనల్ కాదన్న విషయాన్ని గుర్తించి వెనక్కి తగ్గాడు.
తనకున్న పరిచయాలతో అనంతపురం జిల్లాకు చెందిన ముఠాను సంప్రదించాడు. తనకు ఎలాంటి ప్రాణహాని లేకుండా తనపై కాల్పులు జరపాలన్న ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికీ రూ.50వేలు చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఆపరేషన్ కోసం సదరు అనంతపురం ముఠా ఇండోర్‌కు చెందిన వారిని రంగంలోకి దింపింది.
తొలుత కాల్పుల సీన్ బయట చేయాలని అనుకున్నా.. సీసీ కెమేరాలు భారీగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇంట్లోనే కాల్పులు జరిపితే బాగుంటుందన్న భావనకు వచ్చాడు. ఇందులో భాగంగానే ఇంట్లోని సీసీ కెమేరాల్ని ముందుగా తొలగించారు. ఇక.. తెల్లవారుజామున అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో పొద్దు పొద్దున్నే తాను అనుకున్న ప్లాన్ ను వర్క్ వుట్ చేసుకునేలా ముహుర్తం పెట్టుకున్నారు. అప్పటికే పలుమార్లు రెక్కీని పూర్తి చేసుకున్న విక్రమ్ గౌడ్.. ఈ కాల్పుల సీన్‌కు ముందు షూటర్లతో పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు.. తనపై కాల్పులు జరిపి వెళ్లేందుకు అవసరమైన వాహనాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తనపై కాల్పులు జరిపే వేళలో జాగ్రత్తగా ఉండాలని విక్రమ్ గౌడ్ ఒకటికి పదిసార్లు చెప్పినట్లుగా తెలిసింది.
అనుకున్నట్లే కాల్పుల వ్యవహారాన్ని పూర్తి చేసిన నిందితులు.. కాల్పుల తర్వాత ఫిలింనగర్ మీదుగా పారిపోయారు. తర్వాత ఆయుధాన్ని కొత్త చెరువులో విసిరేసి.. షేక్ పేట వెళ్లారు. అక్కడి నుంచినానక్ రాం గూడా చేరుకొని.. ఆపై సర్వీస్ రోడ్ అనుసరించి సిటీ నుంచి బయటపడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉదంతానికి సంబంధించి కాల్పులకు సహకరించిన నందూ లతో పాటు.. తనపై కాల్పులు జరిపేలా ప్లాన్ చేసుకున్న విక్రమ్ గౌడ్ తో పాటు అహ్మద్.. రాజా.. మురళి.. రాజశేఖర్ లను నిందితులుగా చేరుస్తూ కేసులో కొత్త మార్పులు చేశారు. కాల్పులు జరిపిన వారిని పట్టుకునేందుకు వీలుగా పోలీసులు గాలింపు చర్యల్ని మరింత ఉదృతం చేశారు. ఒక సమస్యను సాల్వ్ చేసుకోవటానికి ఎంతకూ సాల్వ్ చేసుకోలేని సమస్యను విక్రమ్ గౌడ్ కొని తెచ్చుకున్నారని చెప్పక తప్పదు.