Begin typing your search above and press return to search.

నాపై ఎవ‌రో కాల్పులు జ‌రిపారు: విక్ర‌మ్ గౌడ్‌

By:  Tupaki Desk   |   29 July 2017 12:18 PM GMT
నాపై ఎవ‌రో కాల్పులు జ‌రిపారు: విక్ర‌మ్ గౌడ్‌
X
హైద‌రాబాద్ లో క‌ల‌కం రేపిన విక్ర‌మ్ గౌడ్ కాల్పుల ఘ‌ట‌న క్ష‌ణానికో మ‌లుపు తిరుగుతోంది. అప్పుల ఒత్తిడి, ఇత‌ర ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగానే విక్ర‌మ్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు అనుమానించిన‌ట్లు కొన్ని చానెళ్ల‌లో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత పోలీసులు విక్ర‌మ్ ఇంటిని ప‌రిశీలించి ఆధారాలు సేక‌రించారు. అక్క‌డ వేరే వ్య‌క్తి విక్ర‌మ్ పై దాడి చేసిన‌ట్లు ఆధారాలు ఏమీ దొర‌క లేద‌ని ప‌లు చానెళ్ల‌లో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తొలిసారిగా విక్ర‌మ్ గౌడ్ స్పందించారు. శ‌నివారం ఆయ‌న పోలీసుల‌కు వాంగ్మూలం ఇచ్చారు. త‌న‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్పులు జ‌రిపార‌ని పోలీసుల‌కు తెలిపారు.

విక్ర‌మ్ గౌడ్ కాల్పుల మిస్ట‌రీ వీడ‌నుంది. తనపై జరిగిన కాల్పుల విషయంలో విక్రమ్‌ గౌడ్ వాంగ్మూలం ఇచ్చారు. త‌న‌పై కాల్పులు జరగ్గానే తాను కిందపడిపోయానని, ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక గట్టిగా అరిచానని ఆయ‌న తెలిపారు. తన అరుపులు విని భార్య షిఫాలి కిందకు వచ్చిందని, 108కు ఫోన్‌ చేయాలని తానే ఆమెకు సూచించానని విక్ర‌మ్‌ చెప్పారు. అంబులెన్స్‌ రాకపోవడంతో కారులోనే ఆస్పత్రికి భార్య తీసుకొచ్చిందని, ఆమెకు డ్రైవర్‌, వాచ్‌మెన్‌ సహకరించారని తెలిపారు. నిన్న నొప్పి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్లే పోలీసులతో మాట్లాడలేకపోయానని చెప్పారు.

తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేప‌థ్యంలో, త‌న‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చిన మాట వాస్తవమేనని విక్రమ్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. మ‌రోవైపు, త‌మ ఇంట్లో జ‌రిగిన‌ కాల్పుల ఘ‌ట‌న మొత్తం ఒక డ్రామా అని వ‌స్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని విక్ర‌మ్ గౌడ్ భార్య షిఫాలి అన్నారు. కాల్పుల విషయంలో మీడియాలో వస్తున్న కథనాలను ఆమె ఖండించారు. విచార‌ణలో అన్ని విష‌యాలు పోలీసులే తేలుస్తార‌న్నారు.

`విక్ర‌మ్‌ పై దాడి చేసింది ఎవ‌రో తెలియ‌దు. ఆరోజు జ‌రిగిన అన్ని విష‌యాలు పోలీసులకు చెప్పాను. ఇక వాళ్లే చూసుకుంటారు. పోలీసుల‌ పై మాకు న‌మ్మ‌కం ఉంది. ప్ర‌స్తుతం విక్ర‌మ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది` అని షిఫాలి మీడియాకు తెలిపారు. తమకు మంచి చేయకపోయినా పర్వాలేదుకానీ త‌మ‌పై దుష్ర్పచారం చేయకండని ఆమె మీడియాను కోరారు. ఇదిలా ఉండ‌గా వేరే ఎవ‌రో వ‌చ్చి దాడి చేసిన‌ట్టుగా రుజువు చేసే ర‌క్త‌మ‌ర‌క‌లు గానీ, సీసీ కెమెరా సాక్ష్యాలు గానీ క‌నిపించ‌లేద‌ని, అక్క‌డ ఉన్న ప‌రిస్థితుల‌న్నీ విక్ర‌మ్ త‌న‌ను తాను కాల్చుకున్న‌ట్లుగానే సూచిస్తున్నాయ‌ని పోలీసులు అనుమానిస్తున్న‌ట్లు కొన్ని చానెళ్ల‌లో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.