Begin typing your search above and press return to search.

త‌గ్గిన బ‌లుపు:చేసిన వెధ‌వ ప‌ని ఒప్పుకున్నాడ‌ట‌

By:  Tupaki Desk   |   10 Aug 2017 4:14 PM IST
త‌గ్గిన బ‌లుపు:చేసిన వెధ‌వ ప‌ని ఒప్పుకున్నాడ‌ట‌
X
దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన హ‌ర్యానా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి కుమార‌ర‌త్నం వికాస్ చేసిన వెధ‌వ ప‌ని ఎపిసోడ్ లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంద‌ని చెబుతున్నారు. నిన్న‌టి వ‌ర‌కూ ప‌వ‌ర్ బ‌లుపుతో పోలీసుల‌కు చుక్క‌లు చూపించిన అత‌గాడి తీరుపై విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెర‌గ‌టం..పోలీసుల మీద ఒత్తిడి పెరిగిన నేప‌థ్యంలో చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోవాల్సి వ‌చ్చింది. దీంతో.. వికాస్‌ ను పోలీసులు మ‌రోసారి అరెస్ట్ చేశారు.

పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకోవ‌టానికి సైతం స‌సేమిరా అన్న అత‌గాడు.. పోలీసుల విచార‌ణ‌లో మాత్రం నిజం ఒప్పుకున్న‌ట్లుగా స‌మాచారం. తాను.. త‌న స్నేహితుడు  చేసిన వెధ‌వ ప‌నిని ఒప్పుకున్న‌ట్లుగా చెబుతున్నారు. మూడు గంట‌ల పాటు పోలీసులు జ‌రిపిన విచార‌ణ‌లో బాధితురాలి కారును తాను వెంబ‌డించిన‌ట్లుగా వికాస్ అంగీక‌రించాడట‌. ఈ కేసులో వికాస్‌కు వ్య‌తిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

అత‌డు చేసిన నేరం కానీ నిరూపిత‌మైతే.. ఏడేళ్లు జైలుశిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. హ‌ర్యానాకు చెందిన ఐఏఎస్ అధికారి కుమార్తె కారును వెంబ‌డించి ఆమెను వేధింపుల‌కు గురి చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని ఆమె ఫేస్ బుక్ లో వెల్ల‌డించ‌టంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌న‌ను వెంబ‌డిస్తున్న వ్య‌క్తికి సంబంధించిన వివ‌రాల్ని పోలీసుల‌కు ఆమె తెలియ‌జేయ‌టం.. ఈ సంద‌ర్భంగా వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే..  ఆ త‌ర్వాత అత‌న్ని విడిచిపెట్టారు. ఈ ఉదంతం మీడియాలో ప్ర‌ముఖంగా మార‌టంతో పాటు.. రాజ‌కీయ సంచ‌ల‌నంగా మారింది. గ‌డిచిన కొద్ది రోజులుగా ఈ వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉంటే.. త‌ప్పు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వికాస్ నేరం చేసిన‌ట్లుగా చూపించే ఆధారాలు ల‌భ్యం కావ‌టంతో బీజేపీ ఇరుకున ప‌డింది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌గా.. క‌నీసం వాటిని తీసుకునేందుకు ఒప్పుకోకుండా బ‌లుపు ప్ర‌ద‌ర్శించాడు. దీంతో.. అత‌ని ఇంటికి నోటీసులు అంటించి వ‌చ్చారు.

విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన స‌మ‌యం కంటే దాదాపు మూడు గంట‌లు ఆల‌స్యంగా వ‌చ్చిన అత‌డ్ని పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. తాజాగా ఛార్జిషీట్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా తాను కారును వెంబ‌డించిన విష‌యాన్ని ఒప్పుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంలో బాధితురాలి తండ్రి.. ఐఏఎస్ అధికారి వీరేంద్ర కందూ తెర మీద‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వికాస్ తండ్రి.. హ‌ర్యానా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అయిన సుభాష్ బ‌రాలా ఇటీవ‌ల చేసిన ఒక వ్యాఖ్య‌ను ఆయ‌న ఉద‌హ‌రించి సూటి ప్ర‌శ్న‌ను సంధించారు.

బాధితురాలి త‌న కుమార్తె లాంటిద‌ని.. తాను అలా భావిస్తాన‌ని సుభాష్ బ‌రాలా వ్యాఖ్యానించారు. దీన్ని కోట్ చేసిన బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు చెప్పిన‌ట్లు బాధితురాలిని త‌న కుటుంబ స‌భ్యురాలిగా భావిస్తే.. అందుకు త‌గ్గ‌ట్లే వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. హ‌ర్యానాలో ఒక సూక్తి ఉంద‌ని.. కుమార్తెల‌ను.. ఆడ‌పిల్ల‌ల‌ను ర‌క్షించ‌టం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని.. సుభాష్ నిజంగానే త‌న కుమార్తెకు తండ్రిలాంటి వాడిన‌ని భావిస్తే.. ఆయ‌న త‌ప్ప‌కుండా ఆమె తండ్రిలానే ప్ర‌వ‌ర్తించాల‌న్నారు.

వికాస్ అరెస్ట్ గురించి ఆయ‌న వ్యాఖ్యానిస్తూ.. పోలీసులు అత‌డ్ని తీసుకెళుతున్న‌ప్పుడు త‌న ముఖం క‌నిపించ‌కుండా క‌వ‌ర్ చేసుకున్నాడ‌ని.. కానీ త‌న కుమార్తె మాత్రం అలా చేయ‌లేద‌న్నారు. త‌న కుమార్తె నిందితురాలు కాద‌ని.. బాధితురాలేన‌ని అందుకే అంద‌రికి త‌న ముఖాన్ని చూపించింద‌న్నారు. ధైర్య‌మంటే అదే.. మార్పంటే అదే అని బాధితురాలి తండ్రి వీరేంద్ర వ్యాఖ్యానించారు.