Begin typing your search above and press return to search.

సారు చెప్పినట్లే బస్సు జర్నీని షురూ చేశాడే!

By:  Tupaki Desk   |   5 Dec 2019 8:13 AM GMT
సారు చెప్పినట్లే బస్సు జర్నీని షురూ చేశాడే!
X
తెలంగాణ అధికారపక్షంలో ప్రజాప్రతినిధులకు కొదవలేదు. వ్యక్తిగత ఛరిష్మా కంటే కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచినోళ్లే ఎక్కువ. గత సంవత్సరం ఇదే సమయానికి ముందస్తు ఎన్నికలు పూర్తి చేసుకోవటం.. ఆ సందర్భంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వొద్దన్న సర్వేలు వెలువడినా.. పట్టుబట్టి మరీ.. తొలి లిస్టులోనే దాదాపు వంద వరకూ అభ్యర్థుల్ని ఎంపిక చేసిన మొనగాడితనం కేసీఆర్ సొంతం.

తాను చెప్పినట్లే చేసి చూపించేరకం కావటంతో కేసీఆర్ నోటి నుంచి ఏం వచ్చినా దాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేసేందుకు గులాబీ ప్రజాప్రతినిధులు పోటీ పడుతుంటారు. కొన్నిసార్లు మాత్రం లింకు మిస్ అవుతుంటారు. ఇలాంటప్పుడు కొందరు తీసుకునే నిర్ణయం.. మందిలో వారిని ప్రత్యేకంగా నిలపటమే కాదు.. అధినేత మదిలో రిజిస్టర్ అయ్యేలా చేస్తుంది.

తాజాగా అలాంటి పనే చేసి ఒక్కసారిగా కొత్త ఫేమ్ ను సొంతం చేసుకున్నారు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసిన తర్వాత.. ప్రగతిభవన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో భేటీ అయిన సందర్భంగా గులాబీ ప్రజాప్రతినిధులు ప్రతి నెలా ఠంచనుగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కేసీఆర్ సారు ఆర్డర్ వేయటం తెలిసిందే.

సారు నోటి నుంచి వచ్చిన మాటను తూచా తప్పకుండా ఫాలో అయ్యే గులాబీ నేతలు.. ఎందుకనో స్తబ్దుగా ఉన్నారు. ఇలాంటివేళ.. దాన్ని బ్రేక్ చేస్తూ మెతుకు ఆనంద్ తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరికి ఆదర్శంగా నిలవటమే కాదు.. ఇక ఎవరికి వారు బస్సు ప్రయాణాలతో పోటీ పడే పరిస్థితిని తీసుకొచ్చారు.

ఈ రోజు వికారాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్యే ఆనంద్.. ఎర్ర బస్సులోనే హైదరాబాద్ కు చేరుకోవటం విశేషం. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే తాను బస్సు జర్నీ చేసినట్లుగా చెప్పారు. ప్రయాణికుల సమస్యల్ని తెలుసుకోవటం కోసమే కాకుండా ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు వీలుగా తాను ఆర్టీసీ బస్సులో జర్నీ చేసినట్లు వెల్లడించారు. మొత్తానికి గులాబీ బిగ్ బాస్ చెప్పిన మాటను మొదట ఆచరించిన మెతుకు ఆనంద్ మిగిలిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పక తప్పదు.