Begin typing your search above and press return to search.

ఇంకో మొన‌గాడు మ‌నోడి దెబ్బ‌కు డంగైపోయాడు

By:  Tupaki Desk   |   24 Dec 2017 4:58 AM GMT
ఇంకో మొన‌గాడు మ‌నోడి దెబ్బ‌కు డంగైపోయాడు
X
పెద్ద‌గా మాట్లాడ‌డు. అన‌వ‌స‌ర‌మైన స‌వాల్ చేయ‌డు. ప్ర‌త్య‌ర్థి విజ‌య గ‌ర్వంతో మాట‌లు మీరుతుంటే మౌనంగా ఉంటాడు. రింగులోకి దిగాక త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించి తానేంటో.. త‌న పంచ్ ఏమిటో తెలిసేలా చేస్తాడు భార‌త స్టార్ బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్‌. ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్‌ లోకి అడుగు పెట్టిన త‌ర్వాత వ‌రుస‌గా ప‌దో గెలుపును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

శ‌నివారం రాత్రి ఆఫ్రికా ఛాంపియ‌న్ ఎర్నెస్ట్ అముజుతో జ‌రిగిన పోటీలో తిరుగులేని విజ‌యాన్ని సాధించాడు. త‌న పంచ్ దెబ్బ‌కు.. దెబ్బ‌ల‌తో పోటీ నుంచి వైదొల‌గాల్సిందే అంటూ బీరాలు ప‌లికిన అముజు మాట‌ల్ని అత‌డికే అనుభ‌వం అయ్యేలా చేసిన విజేంద‌ర్ పంచ్ లు భార‌త అభిమానుల్ని అల‌రించాయి.

త‌న‌తో పోటీకి దిగుతున్న విజేంద‌ర్‌ కు గాయాలు త‌ప్ప‌వంటూ స‌వాల్ విసిరిన అముజుకు రింగులో విజేంద‌ర్ ఇచ్చిన పంచ్‌ కు ద‌వ‌డ‌కు భారీ గాయమైంది కూడా. త‌న‌తో పోటీ అంటే ఆచితూచి మాట్లాడాలి.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని వ్యాఖ్య‌లు చేయాల‌న్న విష‌యాన్ని మ‌రింత అర్థ‌మ‌య్యేలా విజేంద‌ర్ త‌న స‌త్తాను చాటాడు.

వ‌రుస‌గా ప‌దో పోటీలోనూ విజ‌యం సాధించి రెండు టైటిళ్ల‌ను సొంతం చేసుకున్నాడు. తాజా గెలుపు అంత సులువుగా రాలేదు. ఆ మాట‌కు వ‌స్తే అముజు ఏమీ చిన్నోడు కాదు. అత‌డి ట్రాక్ రికార్డు చూస్తే.. అత‌గాడు ఎంత మొన‌గాడో అర్థ‌మ‌వుతుంది. ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్ లో అముజు ఎంతో అనుభ‌వం ఉన్నోడు. విజేంద‌ర్ కంటే తోపుగాడ‌న్న విష‌యం అత‌డి వ్య‌క్తిగ‌త గ‌ణాంకాల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. అత‌ను మొత్తం 25 బౌట్ల‌లో త‌ల‌ప‌డితే.. 21 నాకౌట్లు స‌హా 23 విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకున్న మొనగాడు.

అలాంటోడు సైతం.. విజేంద‌ర్ ధాటికి త‌ట్టుకోలేకపోయాడు. జైపూర్ లోని స‌వాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జ‌రిగిన బౌట్ లో అముజుకు త‌న పంచ్ ల‌తో దిమ్మ తిరిగేలా చేశాడు. ఈ పోటీకి ముందు అముజు మాట్లాడుతూ.. విజేంద‌ర్ ను నాకౌట్ చేస్తాన‌ని.. గాయాల‌తో అత‌డ్ని బౌట్ నుంచి బ‌య‌ట‌కు పంపుతానంటూ చాలానే మాటలు మాట్లాడాడు. ఇలాంటి మాట‌ల్ని మాట్లాడ‌ని విజేంద‌ర్ త‌న స‌త్తాను బౌట్ లో ప్ర‌ద‌ర్శించాడు. అముజు మీద పిడిగుద్దులు కురిపించిన విజేంద‌ర్‌.. చివ‌ర్లో అముజు ద‌వ‌డ మీద ఇచ్చిన భారీ పంచ్ తో గాయ‌మైంది కూడా. ఇప్ప‌టి వ‌ర‌కూ తాను బ‌రిలో దిగిన ప‌ది బౌట్ల‌లో ఏడు నాకౌట్ విజ‌యాలతో ప‌ది పోటీల్లోనూ విజ‌యం సాధించి తన‌కు తిరుగులేద‌ని ఫ్రూవ్ చేసుకున్నాడు. బాక్సింగ్‌లో మొన‌గాళ్లు అన్న వాళ్ల‌ను సైతం త‌న పంచ్ ల‌తో మ‌ట్టి క‌రిపిస్తున్న విజేంద‌ర్ ను మొన‌గాళ్ల‌కు.. మొన‌గాడిగా అభివ‌ర్ణించ‌క త‌ప్ప‌దు.