Begin typing your search above and press return to search.

సీఈసీని జ‌గ‌న్ పార్టీ నేత‌లు ఎందుకు క‌లిసిన‌ట్లు?

By:  Tupaki Desk   |   18 May 2019 9:49 AM GMT
సీఈసీని జ‌గ‌న్ పార్టీ నేత‌లు ఎందుకు క‌లిసిన‌ట్లు?
X
ఏపీలో పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనూ.. జ‌రిగిన త‌ర్వాత కామ్ గా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు.. తాజాగా అందుకు భిన్నంగా పోలింగ్ సంద‌ర్భంగా టీడీపీ నేత‌లు దారుణంగా వ్య‌వ‌హ‌రించారంటూ చేస్తున్న ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన పాతిక‌రోజుల త‌ర్వాత నిద్ర లేచి.. చంద్ర‌గిరి నియోజ‌క‌వర్గంలో చోటు చేసుకున్న దుర్మార్గాల్ని ఈసీకి చూపించ‌టం ద్వారా రీపోలింగ్ అనుమ‌తి పొంద‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీలో కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు విజ‌య‌సాయి రెడ్డి త‌దిత‌రులు తాజాగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 23న జ‌రిగే కౌంటింగ్ సంద‌ర్భంగా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయ‌న కోరారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడిన విజ‌య‌సాయి ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు. చంద్ర‌గిరి ప‌రిధిలో జ‌రిగే రీపోలింగ్ స‌జావుగా జ‌రిగేలా చూడాల‌ని పేర్కొన్న‌ట్లు చెప్పారు. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు చేస్తున్న ఆరాచ‌కాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లామ‌ని.. త‌న పేషీలో ప‌ని చేసిన అధికారిని క‌లెక్ట‌ర్ గా నియ‌మించుకొని ఆరాచ‌కాలు చేస్తున్న‌ట్లుగా ఆరోపించారు.

పోలింగ్ పూర్తి అయిన వెంట‌నే త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో జ‌రిగిన పోలింగ్ అక్ర‌మాల‌ను చెవిరెడ్డి ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లార‌ని.. ఫిర్యాదు చేశార‌న్నారు. క‌లెక్ట‌ర్ తో టీడీపీ నేత‌లు కుమ్మ‌క్కై.. ద‌ళితుల్ని ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా చేశార‌న్నారు. టీడీపీ బ‌ట‌న్ నొక్కి అన్ని ఓట్లు వేయించుకున్నార‌ని.. దానిపై విచార‌ణ చేయించిన పీవోను క‌లెక్ట‌ర్ బెదిరించార‌న్నారు. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

అత‌ను ప్రాణ‌భ‌యంతో రిగ్గింగ్ జ‌ర‌గ‌లేద‌ని రాయించార‌ని.. ఈ విష‌యాన్ని సీఈసీకి ఫిర్యాదు చేశామ‌న్నారు. సీసీ పుటేజ్ చూసిన వారు ప్ర‌జాస్వామ్యంలో ఇంత‌టి దుర్మార్గం ఎక్క‌డైనా జ‌రుగుతుందా? అని విస్మ‌యం వ్య‌క్తం చేసిన‌ట్లు చెప్పారు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా రీపోలింగ్ జ‌రిగిన ఐదు పోలింగ్ బూతుల్లో అన్ని ఓట్లు టీడీపీకే వేయించుకున్నార‌న్నారు.

రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో రిట‌ర్నింగ్ అధికారి మంత్రి ప‌రిటాల సునీత‌కు తొత్తుగా ప‌ని చేస్తున్న విష‌యాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామ‌న్నారు. ఆమెను కౌంటింగ్ విధుల నుంచి తొల‌గించాల‌ని కోరిన‌ట్లుగా చెప్పారు. టీడీపీలో గుండాలు.. రౌడీల‌ను పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లుగా నియ‌మించార‌ని.. వారి కార‌ణంగా శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించేలా కుట్ర‌లు ప‌న్నుతున్నార‌న్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్ విష‌యంలో ఫిర్యాదు చేశామ‌న్న విజ‌య‌సాయి.. కౌంటింగ్ సంద‌ర్భంగా ఏపీ పోలీసుల‌తో కాకుండా సెంట్ర‌ల్ పోలీసులను నియ‌మించాల‌ని.. చిత్తూరు జిల్లా క‌లెక్ట‌ర్ ను.. ఆర్డీవోను మార్చాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు చెప్పారు. మ‌రి.. వీటిల్లో ఎన్నింటికి ఈసీ సానుకూలంగా స్పందిస్తుందో చూడాలి.