Begin typing your search above and press return to search.

కెప్టెన్ కూటమిలో ఎన్ని పంచాయితీలో..?

By:  Tupaki Desk   |   28 March 2016 4:29 AM GMT
కెప్టెన్ కూటమిలో ఎన్ని పంచాయితీలో..?
X
తమిళనాడు రాజకీయాల్లో పరిణామాలు జోరుగా మారిపోతున్నాయి. అధికార అన్నాడీఎంకే.. విపక్ష డీఎంకేకు ధీటుగా కూటమిని ఏర్పాటు చేసి తాజా ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్న డీఎండీకే అధనేత కెప్టెన్ విజయ్ కాంత్ కూటమిలో లొల్లి రోజురోజుకీ పెరిగిపోతోంది. కలిసి కట్టుగా తమ రాజకీయ ప్రత్యర్థులపై పోరాటం చేయాల్సింది పోయి.. తమలో తామే కీచులాడుకోవటం ఇప్పుడు వినోదంగా మారింది. తనకు తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకునేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తున్న విజయ్ కాంత్ తన ఆకాంక్షను నెరవేర్చుకునే విషయంలో చేస్తున్న ప్రయత్నాలు అంత గొప్పగా లేవన్న మాట వినిపిస్తోంది.

ఎందుకంటే.. విజయ్ కాంత్ కూటమి విషయానికి వస్తే.. పేరు దగ్గర నుంచి సీట్ల పంపకం మధ్యనున్న పంచాయితీలు అన్నిఇన్నీ కావు. ప్రతి విషయంలోనూ కూటమి నేతల మధ్య చోటు చేసుకుంటున్న విభేదాలు చూసినప్పుడు.. ఎన్నికల్లో ప్రత్యర్థులపై పోరాడటం పోయి తమలో తామే అధిపత్య పోరుతో నలిగిపోతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది.

ఎండీఎంకే నేత వైగో.. సీపీఎం.. సీపీఐ.. వీసీకే నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రజా సంక్షేమ కూటమిలో విజయ్ కాంత్ వచ్చి చేరటంతో.. ఆ కూటమిని కెప్టెన్ గ్రూప్ గా పిలవాలన్నది విజయ్ కాంత్ ఆరాటం. దీనికి వైగో మినహా మిగిలిన నేతలంతా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి ఉన్న పేరే కూటమికి కొనసాగించాలన్నది వారి వాదన. ఇదిలా ఉంటే.. సీట్ల కేటాయింపులోనూ పంచాయితీ నెలకొంది. మొత్తం సీట్లలో 124 సీట్లను విజయ్ కాంత్ పార్టీకి ఇవ్వగా.. మిగిలిన 110 సీట్లకు ఎండీఎంకే.. వీసీకే.. సీపీఎం.. సీపీఐలు పంచుకోవాలని నిర్ణయించాయి.

మాటకు ఓకే అనుకున్నా.. అందుకు తగ్గట్లు సీట్ల కేటాయింపుల వరకు వచ్చేసరికి అసంతృప్తులు ఒక్కసారిగా బయటపడ్డాయి. ప్రస్తుతం సీపీఎం.. సీపీఐ పార్టీలకు 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటే.. తమకు కేటాయించాల్సిన సీట్ల కంటే.. తమిళనాడు అసెంబ్లీలో అస్సలు ప్రాతినిధ్యం లేని ఎండీఎంకే.. వీసీకేలకు అత్యధిక సీట్లు కేటాయించటం ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారంపై వామపక్షాలు తీవ్ర అసహనంతో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇకపై కూటమిలోకి వచ్చే వారికి కేటాయించాల్సిన సీట్లు ఏవైనా.. కెప్టెన్ ఖాతాలో కోత విధించుకోవాలన్న మాట ఇప్పుడు తెర మీదకు వచ్చింది.

దీనిపై విజయ్ కాంత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ప్రతి విషయంలోనూ కూటమిలోని పార్టీల మధ్య నెలకొన్న పంచాయితీలతో కెప్టెన్ తీవ్ర ఆగ్రహంతోనూ.. అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా.. తలో మాటతో ఉన్న కెప్టెన్ కమ్ ప్రజా సంక్షేమ కూటమి తమిళనాడు ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కూటమి నేతలు కోట్లాటలు ఆపి ఎన్నికల్లో విజయం సాధించే అంశంపై దృష్టి సారిస్తే సరి.. లేదంటే మొదటికే మోసం రావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.