Begin typing your search above and press return to search.

జీయ‌ర్ సారీ చెప్పారు!..వివాదం స‌ద్దుమ‌ణిగేనా!

By:  Tupaki Desk   |   29 Jan 2018 9:33 AM GMT
జీయ‌ర్ సారీ చెప్పారు!..వివాదం స‌ద్దుమ‌ణిగేనా!
X
త‌మిళ తల్లి గీతాలాప‌న సంద‌ర్భంగా స‌ద‌రు గీతానికి గౌర‌వ సూచ‌కంగా లేచి నిల‌బ‌డాల్సి ఉండ‌గా... కూర్చుండిపోయిన కంచి మ‌ఠాధిప‌తి విజేంద్ర స‌ర‌స్వ‌తి జీయ‌ర్ స్వామిపై త‌మిళ సంఘాలు అగ్గి మీద గుగ్గిల‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. జీయ‌ర్ స్వామి ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌మిళ త‌ల్లి గీతాన్ని అవ‌మానించార‌ని భావించిన త‌మిళ సంఘాలు.. కంచి పీఠం ఎదుట ఆందోళ‌న‌కు కూడా దిగాయి. త‌మిళ విద్యార్థులు కంచి పీఠం వ‌ద్ద‌కు చేరుకున్న సంద‌ర్భంగా తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే విష‌యాన్ని కాస్తంత వేగంగానే గ‌మ‌నించిన పోలీసులు రంగంలోకి దిగిపోయారు గానీ... లేదంటే చాలా బీభ‌త్స‌మే జ‌రిగిపోయి ఉండేది. మొత్తానికి త‌మిళ సంఘాలు ఈ విష‌యంపై ఆందోళ‌న వెలిబుచ్చిన వెంట‌నే జీయ‌ర్ స్వామి స్పందించి ఉంటే స‌రిపోయేది గానీ... కంచి పీఠం ఎదుట త‌మిళ విద్యార్థులు వ‌చ్చేదాకా, ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డే దాకా ఆయ‌న మిన్న‌కుండే పోయారు. అయితే అక్క‌డ నెల‌కొన్న ఉద్రిక్త వాతావ‌ర‌ణం చూసిన త‌ర్వాతే ఆయ‌న స్పందించ‌డంపై త‌మిళ సంఘాలు నిజంగానే ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

మొత్తంగా ఈ వివాదం ఎలా రేకెత్తింద‌న్న విష‌యంలోకి వ‌స్తే... ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన జీయ‌ర్ స్వామి త‌మిళ త‌ల్లి గీతాలాప‌న సంద‌ర్భంగా ధ్యాన ముద్ర‌లో కూర్చున్న‌ట్లుగా కూర్చుండిపోయారు. అయితే ఆ గీతాలాప‌న సంద‌ర్భంగా అక్క‌డి వారంతా లేచి నిల‌బ‌డ‌తారు. ఈ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోని జీయ‌ర్ స్వామి గీతాలాప‌న సంద‌ర్భంగా కూర్చుండిపోయారు. అయితే ఆ త‌ర్వాత వినిపించిన జాతీయ గీతాలాప‌న సంద‌ర్భంగా మాత్రం ఆయ‌న లేచి నిల‌బ‌డ్డారు. ఈ రెండు గీతాలాప‌న‌ల సంద‌ర్భంగా స్వామి వారి వ్య‌వ‌హార స‌ర‌ళిని ప‌రిశీలించిన త‌ర్వాతే త‌మిళ సంఘాలు కంచి పీఠాధిప‌తిపై నిప్పులు చెరిగాయి. అయితే ప‌రిస్థితి చేయి దాటిపోదులే అన్న భావ‌న‌తో జీయ‌ర్ స్వామి ఈ వివాదాన్ని అంత‌గా ప‌ట్టించుకోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ప్రాంతీయాభిమానంలో ఇత‌రుల కంటే నాలుగు ఆకులు ఎక్కువ చ‌దివిన తంబీలు ఈ విష‌యాన్ని అంత ఈజీగా విడిచిపెట్టేందుకు సాహ‌సించ‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌మిళ విద్యార్థులు కంచి పీఠాన్ని ముట్టించే య‌త్నం చేయ‌డం, పోలీసులు అడ్డుకోవ‌డం, వెర‌సి అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో జీయ‌ర్ స్వామి స్పందించ‌క త‌ప్ప‌లేదు.

త‌మిళ త‌ల్లి గీతాన్ని తాను అవ‌మానించ‌లేద‌ని, ఒక‌వేళ త‌న‌కు తెలియ‌కుండా అలా జ‌రిగిపోయి ఉంటే క్ష‌మించండ‌ని జీయ‌ర్ స్వామి పేరిట కంచి మ‌ఠం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. అంతేకాకుండా స్వామి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన నేప‌థ్యంలో ఈ వివాదాన్ని ఇంత‌టితో వ‌దిలేయాల‌ని కూడా విజ్ఞ‌ప్తి చేసింది. అంతేకాకుండా తమిళ త‌ల్లి గీతాలాప‌న సంద‌ర్భంగా స్వామి ధ్యాన ముద్ర‌లో ఉన్నార‌ని, ధ్యాన ముద్ర‌లో ఉన్న కార‌ణంగానే స్వామిజీ లేచి నిల‌బ‌డ‌లేద‌ని, ఈ నేప‌థ్యంలో దీనిని త‌మిళ త‌ల్లి గీతాలాప‌న‌ను అవ‌మానించిన‌ట్లుగా భావించ‌రాద‌ని కోరింది. కంచి పీఠం నుంచి ఈ లేఖ విడుద‌లైనా... తంబీల ఆగ్ర‌హావేశాలు చ‌ల్లార‌లేద‌నే చెప్పాలి. జాతీయ గీతాలాప‌న సంద‌ర్భంగా లేచి నిల‌బ‌డ్డ స్వామీజీ.. త‌మిళ త‌ల్లి గీతాలాప‌న స‌మ‌యంలో కూర్చుండిపోవ‌డం దేనికి నిద‌ర్శ‌న‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిపోయిన బీజేపీ త‌మిళ‌నాడు శాఖ రాష్ట్ర అధ్య‌క్షురాలు తమిళసై సౌందరరాజన్.... స్వామీజీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాక కూడా త‌మిళ సంఘాలు ఆందోళ‌న కొన‌సాగించ‌డం స‌రికాద‌ని పేర్కొన్నారు. జ‌రిగిందేదో జ‌రిగిపోయింది... స్వామీజీ క్ష‌మాప‌ణ‌ల‌ను స్వాక‌రించి ఆందోళ‌న‌ను విర‌మించాల‌ని ఆమె తంబీల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రి త‌మిళ‌సై విజ్ఞ‌ప్తితోనైనా త‌మిళ తంబీలు త‌గ్గుతారో, లేదో చూడాలి.